Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం కొనుగోళ్లలో హమాలీ బిల్లులకు కేంద్రం ఎగనామం
- ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ.3.50 కోట్లు పెండింగ్ రైతులపై అదనపు భారం
- కేంద్రం నిబంధనలతో హమాలీ చెల్లింపులు నిలిపివేత
నవతెలంగాణ - రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు విక్రయించిన ధాన్యానికి హమాలీ చార్జీల చెల్లింపుల్లో కేంద్రం కోతలు విధించింది. రైతులకు చెల్లించాల్సిన బిల్లులు ఇవ్వకుండా ఏండ్ల కొద్దీ పెండింగ్లో పెడుతోంది. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల్లో పనిచేస్తున్న హమాలీ కార్మికుల చార్జీల పెంపుతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మాత్రం హమాలీ బిల్లుల చెల్లింపులపై సడీసప్పుడు లేకుండా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తూ.. కేంద్రం నిబంధనల మేరకు హమాలీ చార్జీలు నిలిపివేసినట్టు చెబుతోంది. కేంద్రం దయ తలిస్తే తప్ప ఇప్పట్లో రైతులకు హమాలీ బిల్లు ఇచ్చేది లేదంటూ అధికారులు తెగేసి చెబుతున్నారు. దాంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర పక్కన పెడితే.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించేందుకు చార్జీలు తడిచిమోపెడవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వరి సాగు రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించారు. ధాన్యం విక్రయించినప్పుడు రైతులు హమాలీ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన హమాలీ డబ్బుల కోసం వారు నాలుగేండ్లుగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 74,255 మందికి గాను హమాలీ బిల్లుల కింద ప్రభుత్వం నుంచి సుమారు రూ. 3 కోట్ల 50 లక్షలు రావాల్సింది ఉంది. రంగారెడ్డిలో ప్రస్తుత సమాచారం మేరకు 2020-21 వానాకాలంలో 2,698 మంది రైతుల నుంచి 11,200 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా రూ.6.16 లక్షల హమాలీ బిల్లు చెల్లించాల్సి ఉంది. యాసంగిలో 74,278 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 15,283 మంది రైతులకు నుంచి సేకరించారు. వీరికి రూ.40,85,291 రావాల్సి ఉంది. 2021-22 వానాకాలం సీజన్లో 9,839 మంది రైతుల నుంచి ప్రభుత్వం 43,564 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, ఇందుకుగాను హమాలీ చార్జీల కింద రూ.73,96,020 చెల్లించాల్సి ఉంది. 2022-23 వానాకాలంలో 13,643 మంది రైతులకు సుమారు రూ. 80 లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఇక వికారాబాద్ జిల్లాలో గతేడాది వానాకాలం, యాసంగి సీజన్లలో 37,659 మంది రైతుల నుంచి 1,89,689 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించారు. దానికి సంబంధించి రూ. 1.43 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది వానాకాలంలో లక్షా 14 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 18,779 మంది రైతుల నుంచి సేకరించారు. ఇందుకు హమాలీ చార్జీల్లో ప్రభుత్వం తమ వాటా కింద రూ. 62,97,445 చెల్లించాల్సి ఉంది. మొత్తంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ.3 కోట్ల 50 లక్షలు హమాలీ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.
కేంద్రం అమోదంతోనే బిల్లులు చెల్లింపు
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు నింపి కాంట వేయడం, లారీలకు ఎత్తడానికి హమాలీలకు రైతుల నుంచి క్వింటాకు రూ.25 నుంచి 30 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ప్రభుత్వం వాటా కింద రైతులకు రూ.5.50 చొప్పున చెల్లించాలి. కానీ ప్రస్తుతం ఆ చెల్లింపులకు స్వస్తీ చెప్పింది. ఆరు సీజన్లు అంటే 2019 నుంచి ప్రభుత్వం హమాలీ బిల్లులు నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే.. కేంద్రం మీద.. కేంద్రాన్ని అడిగితే.. రాష్ట్ర ప్రభుత్వం మీద సాకులు చెప్పుకోవడం తప్ప రైతులకు న్యాయం జరిగింది లేదు. కేంద్రం నిబంధనల మేరకు రైతులకు చెల్లించాల్సిన హమాలీ బిల్లులు నిలిపివేసిట్టు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఏడాది కూడా వస్తాయో రావో తెలియని పరిస్థితి ఉందని, కేంద్రం గైడ్లైన్స్ వస్తే తప్ప హమాలీ బిల్లులు ఇవ్వడానికి లేదని అధికారులు తెగేసి చెబుతున్నారు. దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా హమాలీ చార్జీలు పెరిగాయి. దాంతో రైతులపై అదనపు భారం పడిందని రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే తన వాటా కింద రైతులకు చెల్లించాల్సిన హమాలీ చార్జీలను పునరుద్ధరించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
హమాలీ బిల్లులు ప్రభుత్వం చెల్లించాలి
ఏండ్ల కొద్దీ పేరుకుపోయిన హమాలీ బిల్లులను కేంద్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి. ప్రస్తుతం పెరిగిన ధరల మేరకు హమాలీ చార్జీలు పెరిగాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయ ఖర్చులు గతం కంటే రెండింతలయ్యాయి. రైతులపై అదనపు భారం పడుతుంది. ప్రభుత్వం గతంలో మాదిరిగా హమాలీ బిల్లులు చెల్లించి, రైతులను ఆదుకోవాలి.
- మదుసుధన్ రెడ్డి, తెలంగాణ రైతు సంఘం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి