Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎవ్వరూ చనిపోలేదనడం అవాస్తవం
''తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జీరో స్థాయికి వచ్చాయి'' ఒకటో తేదీన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలతో సమావేశంలో సీఎం కేసీఆర్. రైతురాజ్యం అని చెప్పుకునే చోట అన్నదాత చావులుండొద్దని అందరూ కోరుకుంటారు. అలా జరగాల్సిందే. కానీ, సీఎం సార్ చెబుతున్నట్టు రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఆగలేదని తెలంగాణ సమాజమంతా కోడై కూస్తున్నది. ఏడేండ్లలో తెలంగాణలో 4,396 మంది రైతుల మరణాలు చోటుచేసుకున్నాయని ఎన్సీఆర్బీ నివేదిక వాస్తవాన్ని కండ్ల ముందట పెట్టింది. రుణ విమోచన కమిషన్ అసలు ఉన్నదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ఇప్పటికైనా జీరో స్థాయి ఆత్మహత్యలు నివారణ దిశగా చర్యలు తీసుకోవాలని మేధావులు, రైతు సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నారు.
- ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం ఏడేండ్లలో 4,396 మరణాలు
- రుణ విమోచన కమిషన్ ఉన్నా లేనట్టే
- రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాలని మేధావుల సూచన
నవతెలంగాణ - పిన్ పాయింట్
రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉన్నది. మార్చి మూడో తేదీన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఇప్పలపల్లికి చెందిన ముదిగంటి శ్రీనివాస్‌రెడ్డి (39) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరు లక్షల అప్పుచేయడం, ఈసారీ పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోవడం వంటి కారణాలతో కుంగిపోయిన ఆ రైతు తనువు చాలించాడు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లిలో యాదయ్య, ఖమ్మం జిల్లా తిరుమలాయ పాలెం మండలం బచ్చోడు తండాలో దారావత్ రవి అనే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా రాసుకుంటూపోతే ఈ సంఖ్య వందల్లోనే ఉంటుంది. ప్రతి ఏటా సగటున 600 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎన్సీఆర్బీనే రైతుల ఆత్మహత్యల వివరాలను ప్రజలను అందుబాటులో ఉంచినా..సీఎం కేసీఆర్ జీరో ఆత్మహత్యలు వచ్చాయని ప్రకటించడం దురదృష్టకరం.
ఆత్మహత్యలకు కారణాలేమిటంటే..
- ప్రకృతి వైపరీత్యాల నష్టం వల్ల పంటలు పూర్తిగా దెబ్బతినడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిహారాలివ్వకపోవడం.
- వ్యవసాయ ఉత్పత్తులను పెట్టుబడికన్నా తక్కువ ధరకు అమ్ముకొని రుణగ్రస్తులు కావడం
- కేంద్ర పంటల బీమా పథకం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడం - తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకపోవడం
- మెట్ట ప్రాంతాలకు నీటి వసతులు లేకపోవడం
- మార్కెట్లలో మోసాలు, కనీస మద్ధతు ధరల అమలు లేకపోవడం, మార్కెట్ కమిటీల నిర్లక్ష్యం, 15 శాతం పంట ధరను కొనుగోలు దారులు దోపిడీ చేయడం
- నూతన టెక్నాలజీని, యాంత్రీకరణను కౌలుదారులు వినియోగించుకోలేకపోవడం
- పండిన పంటను నిలువపెట్టుకోవడానికి మౌళిక సౌకర్యాలు గోదాముల సౌకర్యం లేకపోవడం వలన 20 శాతం పంటలు నష్టపోవడమో, తక్కువ ధరకు అమ్ముకోవడమో జరుగుతున్నది.
- కేంద్ర ఎఫ్‌సిఐ సంస్కరణలు చేపట్టి అన్ని పంటలను సేకరించకపోవడం (ఉత్తరాదిలో ముతక ధాన్యాలు, పప్పులు, నూనెగింజలు సేకరిస్తున్నారు)
- ఉత్పాదకత తగ్గడం
- పండిన పంటను ప్రాసెసింగ్ చేసే అవకాశాలు లేకపోవడం వలన ముడి ఉత్పత్తులనే అమ్మడం
- బ్యాంకులు రుణాలివ్వకపోవడం వల్ల అధిక వడ్డీలకు ప్రయివేటుగా అప్పులు తెచ్చి పండిన పంట వడ్డీకే చెల్లించడం జరుగుతున్నది.
- కల్తీ విత్తనాల వల్ల పెట్టుబడి పెట్టిన తర్వాత కాతా, పూతా లేకుండా పంటలు దెబ్బతింటున్నాయి. ఈ సంవత్సరం 20 వేల క్వింటాళ్ళ కల్తీ విత్తనాలు పట్టుబడినప్పటికీ కల్తీ వ్యాపారుల, పాలకుల - మిలాఖత్ వల్ల ఎవరిపైనా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదు.
- కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు వర్తించకపోవడం. కౌలు, పెట్టుబడి భారాలు భరించలేనివిగా తయారవ్వడం.
రాష్ట్ర సర్కారు చేయాల్సింది ఇదే..
ఆత్మహత్యల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు, రైతు సంఘాలతో కలిపి సమావేశం జరపాలి. ప్రతిష్టకు పోకుండా ఆత్మహత్యలు జరుగుతున్న వాస్తవాన్ని గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం ఇచ్చే రైతుబీమా కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలకు వర్తించడంలేదు. వారి పిల్లలు విద్యా, వైద్యం నోచుకోక అనాథలుగా బతుకుతున్నారు. నిపుణులతో కమిటీ వేసి పరిష్కారాలు చూడాలి. రుణ విమోచన కమిషన్ ఉన్నా అది ఆత్మహత్యలను నివారించడంలో శ్రద్ధ చూపడం లేదు. దాన్ని పనిలో పెట్టాలి. చివరికి శాసన సభలో ఎన్సీఆర్బీ రిపోర్టును చర్చనీయాంశం చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యాన్ని గుర్తింపజేస్తున్నది. ఇప్పటికైనా బేషజాలకు పోకుండా ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వ శాఖను పనిచేయించాలి. సీఎం కేసీఆర్ వాస్తవాలను గ్రహించి ముందుకెళ్తే మంచిది. రైతు ఆత్మహత్యల నివారణకు మేధావులు, రైతు సంఘాల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది.
తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యల వివరాలు (ఎన్సీఆర్బీ రిపోర్టు)
ఏడాది మరణాలు
2016 645
2017 851
2018 900
2019 491
2020 466
2021 483
2022 560