Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై మంత్రి కేటీఆర్
- కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలు మానుకోవాలంటూ హితవు : కేంద్ర ప్రభుత్వానికి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేటీకరించే కుట్రలను విరమించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు, ప్రజలు ఆందోళనలు చేస్తున్నా... దొడ్డిదారిన ప్రయివేటుకు కట్టబెట్టే కుతంత్రానికి కేంద్రం తెరలేపిందని తెలిపారు. వర్కింగ్ కాపిటల్, ముడిసరుకు కోసం నిధుల సమీకరణ పేరిట స్టీల్ ప్లాంట్ తాళాలను ప్రయివేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు కేంద్రం ఏకంగా ఒక నోటిఫికేషన్ జారీ చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేటుకు అప్పగించే కుట్రలను ఆపేయాలని కోరుతూ కేటీఆర్ ఆదివారం కేంద్రానికి లేఖ రాశారు.వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కుట్రలను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని ఆయన పునరుద్ఘాటించారు. కేంద్రంలోని బీజేపీ తన ఎజెండా అమలు కోసం మాత్రమే స్టీల్ ప్లాంట్‌ను క్రమంగా చంపే ప్రయత్నం చేస్తుందన్నారు. స్టీల్ ఉత్పత్తి రంగాన్ని నాన్ స్ట్రాటజిక్ రంగంలోకి మార్చడంలోనే కేంద్ర ప్రభుత్వం కుట్ర దాగి ఉందని వాపోయారు. ఒకప్పుడు ప్రభుత్వ రంగంలో భారీ ఎత్తున సిమెంట్‌ను ఉత్పత్తి చేసిన పరిశ్రమలన్నింటిని పూర్తిగా ప్రయివేటుపరం చేసిన కేంద్రంలోని ప్రభుత్వాలు, ప్రస్తుతం స్టీల్ పరిశ్రమను కూడా అదే రీతిన ప్రయివేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఇందులో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను నష్టాల పాల్జేసి... వాటిని సాకుగా చూపించి లక్షల కోట్ల విలువైన ఆస్తులను అప్పనంగా ప్రయివేట్, కార్పొరేట్ మిత్రులకు అప్పజెప్పేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన ప్రత్యేక ఐరన్ వోర్ గనులను కేటాయించకుండా పథకం ప్రకారం నష్టాల్లోకి నెట్టేందుకు కుట్ర చేస్తోందన్నారు. నష్టాలను సాకుగా చూపించి తన కార్పొరేట్ కంపెనీల మిత్రులకు 12.5 లక్షల కోట్ల రూపాయలను రద్దు చేసిన ప్రధాని మోడీకి.. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై కనికరం ఎందుకు లేదని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో వంద శాతం ఉత్పత్తి జరిగితే కంపెనీ లాభాల బాట పడుతుందని స్పష్టంచేశారు. వర్కింగ్ కాపిటల్ పేరుతో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేట్ కంపెనీలతో కలిపే ప్రయత్నాన్ని పూర్తిగా విరమించుకోవాలని డిమాండ్ చేశారు. దాదాపు లక్ష కోట్ల రూపాయలతో తన విస్తరణ ప్రణాళికలను ప్రకటించిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)తో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కలపవచ్చని సూచించారు. సెయిల్ సంస్థ ఈ దిశగా ముందుకొస్తే తెలంగాణ ప్రభుత్వం ఎన్నాళ్లుగానో డిమాండ్ చేస్తున్న బయ్యారం స్టీల్ ప్లాంట్‌తో పాటు కడపలోనూ మరో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఈకో సిస్టం ఏర్పడుతుందన్నారు. పైగా దేశ మౌళిక రంగానికి అవసరమైన స్టీల్ సరఫరా భద్రత ప్రయివేట్ కంపెనీల దాయాదాక్షిణ్యాల మీద అధారపడాల్సిన అవసరం ఉండదన్నారు. దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు రూ.25వేల కోట్ల వరకు మాత్రమే రుణాలు తీసుకునే అవకాశం కల్పించిన కేంద్రం... ప్రయివేట్ కంపెనీలకు మాత్రం దాదాపు 70 నుంచి 80 వేల కోట్ల రూపాయల వరకు రుణాలను పొందగలిగే సౌకర్యాన్ని కల్పించిందన్నారు. ప్రయివేట్ కంపెనీలతో సమానంగా విశాఖ స్టీల్ కంపెనీకి రుణ సౌకర్యాన్ని కల్పించే దిశగా చొరవ చూపాలని కోరారు. తక్షణం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి రూ.5వేల కోట్లను కేటాయించాలని సూచించారు. గతంలో ప్రధాన మంత్రులుగా పనిచేసిన పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్‌పాయి హయాంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి నేరుగా నిధులు కేటాయించారని గుర్తుచేశారు. దేశంలో చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టులకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి నేరుగా స్టీల్‌ని కొనుగోలు చేయాలని సూచించారు. ప్రపంచ కుబేరుడి జాబితాలో స్ధానం పడిపోయిన తమ మిత్రుని కంపెనీకి మేలు చేసేందుకు వీలుగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు. మోడీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ పరం చేసేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారనీ..లాభాలను కార్పొరేట్లకు అందిస్తూ, నష్టాలను జాతీయం చేస్తున్నారని విమర్శించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగాల భవిష్యత్తును కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో వారితో కలిసి పని చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు. ఇందుకోసం కలిసి వచ్చే వారందరితో కలిసి ప్రజలను మరింత చైతన్యవంతం చేస్తామన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల హక్కు.. దాన్ని కాపాడుకోవడం కోసం తెలుగువారందరు కలిసి రావాలని కేటీఆర్్ ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టేందుకు స్టీల్ ప్లాంట్ కార్మికులు, కార్మిక సంఘాలను కలిసి సంఘీభావం తెలియజేయాలని భారత రాష్ట్ర సమితి శాఖ ఏపీ అధ్యక్షులు తోట చంద్రశేఖర్‌కు ఆయన సూచించారు.
విశాఖ గురించి మనం ఇప్పుడు మాట్లాడకపోతే.. మోడీ ప్రభుత్వం ఆ తర్వాత సింగరేణి కాలరీస్ విషయంలోనూ ఇదే ధోరణితో వ్యవహరించే అవకాశం ఉందంటూ ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఇది గుర్తుంచుకోండి.. అంటూ జర్మనీలో నాజీల దురాగతాలను తీవ్రంగా నిరసిస్తూ జర్మన్ క్రైస్తవ మతబోధకుడు మార్టిన్ నీమొల్లర్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా తన ట్వీట్‌కు జతచేశారు.''మొదట వాళ్లు కమ్యూనిస్టుల కోసం వచ్చారు.. నేను మాట్లాడలేదు.. ఎందుకంటే నేను కమ్యూనిస్టుని కాదు. ఆ తర్వాత వాళ్లు సోషలిస్టుల కోసం వస్తే నేను మాట్లాడలేదు.. ఎందుకంటే నేను సోషలిస్టుని కాదు.. తర్వాత వాళ్లు కార్మిక సంఘం నేతల కోసం వస్తే.. నేను మాట్లాడలేదు.. ఎందుకంటే నేను ట్రేడ్ యూనియనిస్ట్ని కాదు. ఆ తర్వాత వాళ్లు యూదుల కోసం వచ్చినా.. నేను మాట్లాడలేదు. ఎందుకంటే నేను యూదుడిని కాదు. చివరకు వాళ్లు నా కోసం వచ్చారు. అప్పుడు నా తరఫున నిలబడి మాట్లాడటానికి ఎవ్వరూలేరు' అంటూ కేటీఆర్ ముగించారు.