Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా గాయని విమలక్క
నవతెలంగాణ-ముషీరాబాద్
సాహిత్యం సమాజ వికాసానికి దోహదపడుతుందని ప్రజా గాయని విమలక్క అన్నారు. ప్రపంచంలో ప్రజల కోసం జరిగిన పోరాటాలన్నింటికీ సాహిత్యం బాసటగా నిలిచిందని తెలిపారు. ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన సాహిత్య అకాడమీ తెలంగాణ రాష్ట్ర 6వ సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విమలక్క మాట్లాడుతూ.. బహుజన సాహిత్య అకాడమీ దేశస్థాయిలో బహుజనుల చైతన్యం కోసం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ మాట్లాడుతూ.. దేశంలో బహుజన రాజ్యాధికారం చైతన్యం కోసం అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలియజేశారు. ఢిల్లీలో ఆల్ ఇండియా బహుజన రైటర్స్ నేషనల్ కాన్ఫరెన్స్ అక్టోబర్ 15న నిర్వహించినట్టు తెలిపారు కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జంపన శ్రీనివాస్ గౌడ్, మహారాష్ట్ర కార్యదర్శి అంది శ్రీనివాస్, ఉత్తరాఖండ్ రాష్ట్ర అధ్యక్షులు సుభాష్ చంద్, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాదేవి రమేష్, అధ్యక్షులు కనుకుంట్ల విజయకుమార్, నాయకులు నేరేడు కృష్ణ, ఆరు వనిత, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.