Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ సందేశంతో ప్రారంభించండి
- సోషల్ మీడియా కమిటీలు బలోపేతం చేయాలి
- టెలికాన్ఫరెన్స్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, మండల, గ్రామస్థాయిల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కే తారకరామారావు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమ్మేళనాలు పార్టీకి, ప్రజలకు మధ్య వారధిగా నిలవాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు రాసిన సందేశంతోనే ఇవి ప్రారంభం కావాలని చెప్పారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు, ప్రతిపక్షాల ఆరోపణలను ధీటుగా తిప్పికొట్టేందుకు సోషల్ మీడియా కమిటీలను మరింత బలోపేతం చేసుకోవాలని అన్నారు. ఆత్మీయ సమ్మేళనాలపై ఆదివారంనాడాయన ఆయా జిల్లాల బాధ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణను ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు. ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణపై పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఆధ్వర్యంలో పది మందితో కమిటీని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్న తీరును పరిశీలిస్తుందన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలు కమిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కమిటీ ద్వారానే సీఎం కేసీఆర్ పార్టీ కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ తీరు, అభిప్రాయాలు తీసుకుంటారని తెలిపారు. ఎన్నికల సంవత్సరం అయినందున ఎమ్మెల్యేలందరూ అత్యంత చురుకైన పార్టీ కార్యకర్తలతో ఒక బందాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ బందం ద్వారా అటు పార్టీకి ప్రజలకు నిరంతరం సమాచారం అందించడం, పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకునేలా ప్రణాళిక చేసుకోవాలని చెప్పారు.
అన్ని నియోజకవర్గాల్లో సామాజిక మాధ్యమాల ద్వారా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకుపోయేందుకు సోషల్ మీడియా కమిటీలు మరింత బలోపేతం చేసుకోవాలని తెలిపారు. మే నెల వరకు ఈ సమ్మేళనాలు నిర్వహించుకోవచ్చని సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారన్నారు. సీఎం కేసీఆర్ రాసిన ఆత్మీయ సందేశం ప్రతి కార్యకర్తకు అందేలా అవసరమైన కరపత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు, పదవుల్లో కొనసాగుతున్న ప్రతి ఒక్కరూ ఈ సమ్మేళనాల్లో పాల్గొనేలా ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు చొరవ తీసుకోవాలని చెప్పారు. తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులు, రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని అన్నారు.