Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు జిల్లాల్లో 55 జీవాలు మృత్యువాత
నవతెలంగాణ- ముస్తాబాద్/కడెం
పలు జిల్లాల్లో పెరుగుతున్న వీధి కుక్కల దాడి గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా గొర్రెల మందలపై దాడిచేస్తూ వాటి మృతికి కారణమవుతున్నాయి. దాంతో గ్రామస్తులు తీవ్రంగా నష్టపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆదివారం రాజన్న సిరిసిల్ల, నిర్మల్ జిల్లాల్లో గొర్రెల మందపై వీధి కుక్కల దాడి చేయడంతో 55 జీవాలు మృత్యువాత పడ్డాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలోని రైతు చిట్టవేని నరసింహులకు చెందిన గొర్రెల మందపై వీధికుక్కలు దాడిచేయగా, 35జీవాలు మృతిచెందాయి. సుమారు రూ. 3.50 లక్షల విలువ చేసే జీవాలు మృత్యువాత పడ్డాయని బాధిత నిరుపేద రైతు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు.నిర్మల్ జిల్లాలోని కడెం మండలం అంబారిపేట్ గ్రామంలో గొర్రెల యజమాని కొండవేణి కొమురయ్యకు చెందిన గొర్రెల కొట్టంలోకి చొరబడిన వీధి కుక్కలు గొర్రెలపై దాడిచేశాయి. ఈ దాడిలో దాదాపు 20 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో 5 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన గొర్రెల విలువ దాదాపు రూ. 2.50 లక్షలకు పైగా ఉంటుందని బాధితుడు తెలిపారు. ప్రభుత్వం, ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ తమకు నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని కోరారు. గ్రామంలో వీధి కుక్కలు ప్రజలు, గొర్రెలు, కోళ్లపై దాడులు చేస్తూ వీరంగం సృష్టిస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.