Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య
నవతెలంగాణ-గోదావరిఖని
నిరుపేదలందరికీ ఇండ్లు సాధించే వరకు సీపీఐ(ఎం) రాష్ట్ర వ్యాప్తంగా భూ పోరాటాలు చేస్తుందని పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పవర్ హౌస్ కాలనీలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో 16రోజులుగా నిర్వహిస్తున్న భూ పోరాట కేంద్రాన్ని ఆదివారం వారు సందర్శించి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సొంత ఇండ్ల స్థలాలు లేని వాళ్లు దాదాపు 32లక్షల మంది ఉన్నారని తెలిపారు. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఎన్నికల సమయంలో 2022 వరకు ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు కట్టిస్తామని చెప్పి.. మోడీ ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కట్టించిన దాఖలాలు లేవని విమర్శించారు. రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ద్వారా సొంతింటి కల నెరవేరుస్తానని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో లబ్దిదారులకు ఇండ్లు అందించిన పరిస్థితి లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.92 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం పూర్తి చేయగా, 32వేల ఇండ్లు మాత్రమే పంపిణీ చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలకు ఇచ్చేందుకు స్థలంలేదని ప్రభుత్వం చెప్పటం దారుణమన్నారు.కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూమిని భూకబ్జాదారులు యథేచ్ఛగా ఆక్రమించుకొని హద్దులు పెట్టుకుంటే మాత్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు. గుడిసెలు వేసుకుంటున్న నిరుపేదలపై మాత్రం పోలీసులు, రెవెన్యూ అధికారులతో దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, స్థానిక అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు స్పందించి గోదావరిఖనిలో ఇండ్లు లేని నిరుపేదలందరికీ తక్షణమే ప్రభుత్వ భూమిలో ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే రానున్న రోజుల్లో భూ పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) పెద్దపల్లి జిల్లా కమిటీ సభ్యులు రాజిరెడ్డి, కుమారస్వామి, మహేశ్వరి, నాయకులు ఫైమదా, పిరు మొహమ్మద్, లావణ్య, సాగర్, నాగమణి, రాజకుమార్, కృష్ణ కుమార్, సురేష్, శివ కుమార్ తదితరులున్నారు.