Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్కు సొంతూరులో గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఆదివారం ఆయన స్వగ్రామమైన జయశంకర్-భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. చంద్రబోస్ తన భార్య సుచరిత, తండ్రి నరసయ్యతో కలిసి హాజరయ్యారు. స్థానికులు డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. ఆయన శివాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం సమ్మేళనంలో పాల్గొని తల్లి మదనమ్మ ఫొటోకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం సర్పంచ్ కర్రె మంజుల అశోక్ రెడ్డి, ఎంపీపీ దావు వినోద వీరారెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ కుంభం క్రాంతి కుమార్రెడ్డి, గ్రామస్తులు, బాల్య స్నేహితులు, పూర్వ విద్యార్థులు, గురువులు.. బొకేలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు, స్నేహితులు మాట్లాడుతూ.. చంద్రబోస్ తమ ఊరివాడు, తమతోటి చదువుకున్నవాడు కావడం ఆనందంగా ఉందని తెలిపారు. 1995లో 'మంచుకొండల్లోన చంద్రమా..' అనే పాటతో సినిమా పాటల రచయితగా రంగ ప్రవేశం చేసి, నేడు త్రిబుల్ ఆర్ సినిమాకి 'నాటు.. నాటు..' పాట రచించి ఆస్కార్ అవార్డు అందుకోవడం గొప్ప విషయమని కొనియాడారు. గతంలో నంది అవార్డు, పలు అవార్డులు అందుకున్నారని అన్నారు. ఆస్కార్ అవార్డుతో అంతర్జాతీయ స్థాయిలో తమ గ్రామానికి గుర్తింపు వచ్చిందని ఎంపీపీ దాబు వినోద వీరారెడ్డి అన్నారు. 840 చిత్రాల్లో సుమారు 3700 పైచిలుకు పాటలను రచించి ఆస్కార్ అవార్డు అందుకొని తెలుగోడి సత్తా చాటారని కొనియాడారు. ఇలాంటి పాటలు మరెన్నో రచించి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.