Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు నోటీస్ అందజేత
- ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈ నెల 17 నుంచి నిరవదిక సమ్మెలోకి వెళ్లాలని ఐకేపీ వీఓఏల ఉద్యోగుల సంఘం (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం నిర్ణయించింది. ఆదివారం సుందరయ్య విజ్ఞన కేంద్రంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.రాజ్ కుమార్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, కార్యదర్శి జె.వెంకటేష్, ఐకేపీ వీఓఏ గౌరవాధ్యక్షులు ఎస్వీ రమ, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నగేష్, రాష్ట్ర ఆఫీస్ బేరర్లు కె.సుమలత, అనిత, వెంకటయ్య, రమేశ్, సుధాకర్, వసియా బేగం, రాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు ధనలక్ష్మి, నెహ్రూనాయక్, శ్రీనుగోపాల్, మౌనిక, అంజి, శ్రీనివాస్, జ్యోతి, అనిత పాల్గొన్నారు. నిరవధిక సమ్మె నోటీస్‌ను సెర్ప్ సీఇవోకు సోమవారం అందజేయనున్నారు. దశలవారీ పోరాటంలో భాగంగా నాలుగు నుంచి అన్ని జిల్లాల్లో సమ్మె నోటీసులు అందజేయనున్నారు. జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీల సమావేశాలు నిర్వహించనున్నారు. 10న కేంద్ర కార్మిక సంఘాలు, ఆయా కార్మిక సంఘాల అనుబంధ వీఓఏ సంఘాల సంయుక్త రౌండ్ టేబుల్ సమావేశాన్ని రాష్ట్రస్థాయిలో, 11 నుంచి అన్ని జిల్లాల్లో జరపనున్నారు. 14న అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలను సమర్పించనున్నారు. ఈ నెల 3 నుంచి 16 వరకు ఆన్లైన్ వర్క్స్ బంద్ పెట్టనున్నారు. మార్చి 16, 17, 18 తేదీల్లో టోకెన్ సమ్మె నిర్వహించి గత నెల 21 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్లైన్ సేవలు బంద్ పెట్టినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. దీంతో ఆన్లైన్ సేవలను బంద్‌ను కొనసాగిస్తూ దశల వారీ పోరాటానికి వెళ్తున్నట్టు పాలడుగు భాస్కర్ తెలిపారు. సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలనీ, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలనీ, రూ.10 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలనీ, ఆన్లైన్ పనులు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. తెలంగాణ వచ్చాక జీతాలు పెంచుతామన్న హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. పై అధికారులకు జీతాలు పెంచి, క్షేత్రస్థాయిలో పని చేసే వారిని విస్మరించడం సరికాదని హితవు పలికారు. గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్న వారికి నెలకు రూ.3,900 వేతనం మాత్రమే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.