Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్ద ఎత్తున తరలిన కార్మికులు,రైతులు, వ్యవసాయ కార్మికులు
- ప్రత్యేక రైళ్లు, బస్సుల్లో పయనం
- మూడు ప్రాంతాల నుంచి మహాప్రదర్శనలు...
- 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ సర్కారుపై సమరానికి రైతులు, కార్మికులు, కూలీలు సిద్ధమయ్యారు. ఈనెల 5న చలో ఢిల్లీ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి బయలుదేరి వెళ్లారు. ప్రత్యేక రైళ్లు, ప్రత్యేక బస్సుల్లో ఆరేడు వేల మంది ఆదివారం తరలివెళ్లారు. ఢిల్లీలో మూడు ప్రాంతాల నుంచి మహాప్రదర్శనలుగా బయలుదేరి, రాంలీలా మైదానానికి చేరుకుంటాయి. దేశ నలుమూలల నుంచి దాదాపు పది లక్షల మంది ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్టు తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి సాగర్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ రైతు సంఘం కార్యాలయం నుంచి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్, టి సాగర్, ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, సీఐటీయూ రాష్ట్ర నాయకులు డిజి నర్సింహారావు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సంపదను గుండు గుత్తగా కార్పొరేట్లకు ఆదానీ, అంబానీలకు అప్పజెప్పడంలో మోడీ సర్కారు తన నిజాయితీ నిరూపించుకున్నదని ఎద్దేవా చేశారు. దేశంలో మొదటి నుండి వామపక్షాలు, ప్రజా సంఘాలు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున్న ఆందోళన చేస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలో డొల్ల, సూట్కేస్ కంపెనీలతో అదానీ లక్షల కోట్ల సామాజ్య్రం కుప్పకూలిపోతోందని హెచ్చరించారు. దీని ఫలితంగా దేశ ప్రజానీకంపై తీవ్రమైన భారాలు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్ఐసీ బ్యాంకింగ్ రంగంలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉందని తెలిపారు. దేశం కోసం, ధర్మం కోసం పేరుతో భావోద్వేగాలతో ప్రజలను రెచ్చగొట్టి దేశ ప్రజల ఆస్తిని దొంగలు పంచుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ సంస్థల పరిరక్షణ, కనీస మద్దతు ధర, విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా, వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం కోసం, నూతన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో తెల్చుకునేందుకు ప్రజాసంఘాలు ఛలో ఢిల్లీకి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. ధాన్యం సేకరణను ప్రభుత్వమే చేపట్టాలనీ, అందరికీ ఉపాధి కల్పించేలా 200 రోజులపనిదినాలు రూ. 600 రూపాయల వేతనం గ్యారెంటీ చేయాలని డిమాండ్ చేశారు. కేరళ ప్రభుత్వ తరహాలో ప్రజా పంపిణీ ద్వారా ప్రజలకు అవసరమైన 14 రకాల వస్తువులను ఉచితంగా సరఫరా చేయాలని కోరారు. దళితులు, బడుగు బలహీన వర్గాలపై దాడులు మహిళలపై దాడులు అరికట్టాలనీ, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అందరికీ విద్య వైద్యం అందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయనున్నట్టు వారు ఈ సందర్భంగా తెలిపారు.