Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విపక్షాలు ఏకమవడం అవసరం : శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో భవిష్యత్‌లో ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంగా మారనుందని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుతో కలిసి ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు మోడీ ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. దేశాన్ని సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలు పాలిస్తున్నాయని, ఇది దేశమనుగడకు ప్రమాదకరమన్నారు. పార్లమెంటరీ వ్యవస్థకు విఘాతం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర హక్కులను జీఎస్టీ పేరుతో హరించి వేస్తుందని, గవర్నర్ వ్యవస్థను దుర్వి నియోగం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధికి అడ్డం పడుతున్నారని విమర్శించారు. దేశంలోనే తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,17,578 ఉందని కేంద్రమే ప్రకటించిందని, దేశంలోనే అగ్రభాగంలో ఉన్నామని చెప్పారు. అభివృద్ధి పథంలోనూ తెలంగాణ ముందంజలో ఉందన్నారు. కేంద్రం తీరు పట్ల కేసీఆర్ బలంగా కొట్లాడుతున్నారని, దీనికి అన్ని పక్షాలు కలిసి రావాలని కోరారు. భవిష్యత్‌లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు అన్ని కలిసే అవకాశం ఉందని చెప్పారు. పేపర్ లీకేజీపై ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదన్నారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే 1.36 లక్షల ఉద్యోగాలు కల్పించారని, మరో 80 వేల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సమయం వచ్చినప్పుడు, అవసరం అనుకున్నప్పుడు తన వారసుడు రాజకీయాల్లోకి వస్తారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధాన మిచ్చారు. బీజేపీని అడ్డుకున్నందుకే కమ్యూనిస్టు పార్టీలతో బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుందని, భవిష్యత్ లో కూడా కలిసి పని చేస్తారని చెప్పారు. మిర్యాల గూడ నియోజకవర్గం భాస్కర్‌రావు నాయకత్వంలో ఎంతో అబివృద్ధి చెందిందని తెలిపారు. భవిష్యత్‌లో కూడా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పరుస్తామన్నారు. రాహుల్‌గాంధీపై అనర్హత వేటు అప్రజాస్వామికమన్నారు.