Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో అప్రకటిత ఎమర్జన్సీ..ప్రమాదంలో ప్రజాస్వామ్యంటూ ఆందోళన :సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ ప్రభుత్వం దేశంలో అప్రకటిత ఎమర్జన్సీని కొనసాగిస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్లో ఆ పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, పశ్య పద్మ, బి.హేమంతరావు, బాలనర్సింహా, కలవేని శంకర్‌లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు దేశ వ్యాప్తంగా 'బీజేపీి కో హఠావో, దేశ్ కో బచావో' అనే నినాదంతో రాష్ట్రంలో యాత్ర నిర్వహిస్తామని చెప్పారు. 'ఇంటింటికీ సిపిఐ' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. వాల్ పోస్టర్‌ను కూనంనేని ఆవిష్కరించారు. బీజేపీని గద్దె దించాలనే లక్ష్యంతో తమ యాత్ర కొనసాగుతుందనీ, అదే సమయం లో బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పులను కూడా ఎండగడుతామని స్పష్టం చేశారు. దేశంలో 75ఏండ్లలో ఎన్నడూ లేని విధంగా నిర్భంధాన్ని మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నదని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని హననం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే దేశం, ఒకే ప్రజ అని చెప్పుకునే ఆ పార్టీ నాయకులు.. తమ అవసరాల కోసం ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి మతం పేరుతో ప్రజలను విడదీసేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టిన విజరు మాల్యా, లలిత్ మోడీ, నీరవ్ మోడీ లాంటి 28 మందితో పాటు ఆదాని లాంటి అక్రమ కార్పొరేట్ వ్యక్తుల సంపదను ప్రభుత్వం జప్తు చేయాలని డిమాండ్ చేశారు. దేశమంతటా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఆయన చెప్పారు. మోడీ అవినీతి, అదానీ, అంబానీలతో ఆయనకున్న అనుబంధం, క్విడ్ ప్రోకో అంశాలపై 2024లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వ విచారణలో బహిర్గతమవుతాయని చెప్పారు. అప్పుడాయన జైలుకు పోకతప్పదని హెచ్చరించారు. దర్యాప్తు సంస్థలను దర్వినియోగం చేస్తే ఆ ఉచ్చు ప్రధాని మోడీ మెడకే చుట్టుకుంటుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్య విలువలను ప్రధాని గౌరవించేవారైతే బీజేపీ నేతలు ఇష్టానుసారంగా చేస్తున్న వ్యాఖ్యలను ఎందుకు నియంత్రి ంచలేదని ప్రశ్నించారు. కానీ ఆయనే ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జన్మకు సంబంధించిన అంశంపై ఒక పార్లమెంటు సభ్యుడు వ్యాఖ్యనిస్తే ఆయనపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని గుర్తుచేశారు. రాహుల్ గాంధీపేరులో గాంధీ ఎందుకు ఉండాలంటూ బీజేపీి నేతలు, ఎంపీలు వ్యక్తిగత దూషణలు చేస్తున్నారనీ, ఇలాంటి దూషణలతో దేశ ప్రతిష్ట ఒక పక్క అంతర్జాతీయంగా మంటగలుస్తున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీరామనవమి రోజున బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గాడ్సే బొమ్మను, మరో పక్క శ్రీరాముని బొమ్మను పెట్టుకుని ఉరేగింపు తీస్తే అలాంటి వారిపై కేసులు నమోదు చేసేది లేదా? అని ప్రశ్నించారు. విభజన హామీలను అమలు చేయని బీజేపీకి తెలంగాణలో ఓట్లు అడిగే హక్కులేదన్నారు. సీబీఐని వ్యతిరేకిస్తూనే పేపర్ లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ కోరడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కేసును సిట్టింగ్ జడ్జీతో విచారించాలని డిమాండ్ చేశారు.
అంబేద్కర్ విగ్రహం నుంచి యాత్ర ప్రారంభం
ఈ నెల 14న చేపట్టబోయే 'ఇంటింటికీ సిపిఐ' ప్రారంభ సభకు సంబంధించి తొలుత లిబర్టీలోని డాక్డర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం నుంచి యాత్రను ప్రారంభించి, ఇందిరాపార్క్ వద్ద సభను నిర్వహిస్తామన్నారు. ఈ సభకు సీపీఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, సయ్యద్ అజీజ్‌పాషా, కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. మే 14న కొత్తగూడెంలో ముగింపు సభను నిర్వహస్తామన్నారు. ఈ సభకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, కేరళ రెవెన్యూ శాఖ మంత్రి కె.రాజన్ పాల్గొంటారని తెలిపారు.
తొమ్మిదిన సీపీఐ,సీపీఐ(ఎం) సంయుక్త సమావేశం
ఈనెల 9న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సీపీిఐ, సీపీిఐ(ఎం) సంయుక్త సమావేశం నిర్వహించనున్నట్టు కూనంనేని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సమావేశానికి ఇరు పార్టీల ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి. రాజా, సీపీఐ(ఎం) పొలిట్ సభ్యులు బి.వి.రాఘవులు, సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ హజరవుతారని తెలిపారు. రెండు పార్టీలకు చెందిన ముఖ్యులు, మండల నాయకులు సుమారు పది వేల మంది హాజరవుతారని తెలిపారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అసమర్ధ విధానాల మూలంగా పేదలపై తీవ్రమైన భారాలు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.