Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రూప్-1 బీసీ అభ్యర్థుల అగచాట్లు
- మరోసారి ఎడిట్ అవకాశం కల్పించాలని వేడుకోలు
- నాడు అవకాశం ఇచ్చినా సకాలంలో అందని సర్టిఫికెట్లు
- ప్రిలిమ్స్ రద్దుతో ఎడిట్ ఆప్షన్ కోసం విజ్ఞప్తి
- అవకాశం కల్పిస్తే వేలాది మంది అభ్యర్థులకు లబ్ది
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
''ఖమ్మానికి చెందిన స్వాతి తండ్రి పోలీసుశాఖలో ఉన్నతోద్యోగం చేస్తున్నారు. బీసీ (ఏ) కేటగిరీకి చెందిన ఈమె గత అక్టోబర్‌లో జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల్లో 60 మార్కులు సాధించింది. వాస్తవానికి ఈమె నాన్ క్రీమిలేయర్ పరిధిలోకి వచ్చినప్పటికీ.. తండ్రి పోస్టు ఆధారంగా 'ది క్యాండెంట్ అండర్ క్రీమిలేయర్ (ఆర్) నాన్ క్రీమీలేయర్' అనే ఆప్షన్ కాలమ్‌లో క్రీమిలేయర్ అని పేర్కొంది. వాస్తవానికి ఈమె నాన్ క్రీమిలేయర్ పరిధిలోకి వస్తుంది. అప్లికేషన్ల సందర్భంలో టీఎస్పీఎస్సీ ఎడిట్ ఆప్షన్ ఇచ్చింది. ఈ క్రమంలో ప్రీతి నాన్ క్రీమిలేయర్ సర్టిఫికెట్ కోసం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించింది. అక్కడ సమాచార లోపం తలెత్తడం.. సకాలంలో ధ్రువీకరణ పత్రం ఇవ్వకపోవడంతో ఎడిట్ ఆప్షన్‌ను ఆమె వినియోగించుకోలేకపోయింది. ప్రిలిమ్స్ పరీక్షలో 40 మార్కులు వచ్చిన నాన్ క్రీమిలేయర్ అభ్యర్థులు సైతం అర్హత సాధించినా క్రీమిలేయర్ ఆప్షన్ ఇవ్వడంతో 60 మార్కులు వచ్చినా ప్రీతి అర్హత సాధించలేకపోయింది.'' ఇది ఒక ప్రీతి సమస్యే కాదు. అనేక మంది అభ్యర్థులు కొద్దిపాటి పొరపాట్ల కారణంగా ఎడిట్ ఆప్షన్‌ను సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఎలాగూ పేపర్ లీకేజీ కారణంగా గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను రద్దు చేసిన నేపథ్యంలో మరోమారు ఎడిట్ ఆప్షన్ అకాశం కల్పించాలని వేలాది మంది అభ్యర్థులు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ని అభ్యర్థిస్తున్నారు.
మరోమారు ఎడిట్ ఆప్షన్ కోసం..
టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను తిరిగి ఈ ఏడాది జూన్ 11వ తేదీన నిర్వహించాలని నిర్ణయించింది. 503 పోస్టులతో గ్రూప్-1 కోసం గతేడాది మే 2వ తేదీన టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆరోజు నుంచే ఆన్లైన్ అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభించింది. గతేడాది జూన్ 4వ తేదీ వరకూ అప్లికేషన్ల గడువు విధించింది. ఆ తర్వాత కూడా మరో నాలుగు రోజులు గడువు పొడగించింది. ఆన్లైన్ అప్లికేషన్ల నేపథ్యంలో సాంకేతిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని అన్ని వివరాలను సరిచూసుకునేందుకు అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత మూడు నిమిషాల వరకూ టైం ఇచ్చింది. ఈలోగా సరిచూసుకుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈక్రమంలో కొద్దిపాటి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయనే అభ్యర్థనల దృష్ట్యా ఎడిట్ ఆప్షన్‌ను ఇచ్చింది. ఈ పరీక్ష కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. 2,86,051 మంది పరీక్షకు హాజరయ్యారు. మెయిన్స్‌కు 25,150 మంది అర్హత సాధించగా.. పేపర్ లీకేజీతో పరీక్షను రద్దు చేశారు. తిరిగి జూన్‌లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తున్న దృష్ట్యా ఈలోగానే ఓ వారం, పది రోజుల పాటు ఎడిట్ ఆప్షన్‌కు అవకాశం ఇవ్వాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి.
నాన్ క్రీమిలేయర్ సర్టిఫికెట్ కోసం..
చాలామంది వెనుకబడిన తరగతులకు చెందిన అభ్యర్థులు క్రీమిలేయర్ సర్టిఫికెట్ విషయంలో కొన్ని అపోహలతో ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు తరచుగా దీని విషయంలో పొరబడుతున్నారు. కుటుంబ వార్షికాదాయం రూ.8లక్షలకు లోపు ఉంటే వారు నాన్ క్రీమిలేయర్ కిందకు వస్తారు. బీసీ విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ లేదా ఫీజు టైంలో ఈ సర్టిఫికెట్‌ను ఇస్తే రాయితీలు లభిస్తాయి. ఆన్లైన్లో దీన్ని సబ్మిట్ చేసేటప్పుడు ది క్యాండెంట్ అండ్ క్రీమిలేయర్ (ఆర్) నాన్ క్రీమీలేయర్ అనే ఆప్షన్లు వస్తాయి. రూ.8లక్షలకు లోపు ఆదాయం ఉన్న వారు నాన్ క్రీమిలేయర్‌గా పరిగణించబడతారు. అలాంటివారు మీ సేవలో ఫామ్-7ఏ అప్లికేషన్‌ను పూర్తి చేసి, ఆధార్, క్యాస్ట్, ఇన్‌కమ్‌తో పాటు లాయర్ నుంచి అఫిడవిట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అఫిడవిట్‌ను ఫామ్-7బీకి పొందుపరచాలి. అప్లికేషన్ వరకే మీ సేవ.. మిగతా ప్రక్రియంతా ఆఫ్‌లైన్‌లోనే చేయాల్సి ఉంటుంది. బీసీ ఏ,బీ,సీ,డీ,ఈ కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఏడాది కాలపరిమితితో కూడిన ఈ సర్టిఫికెట్‌ను తహసీల్దార్ కార్యాలయం నుంచి పొందాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఆదాయ ధ్రువీకరణ ఎలాగైతే పొందుతామో.. క్రీమీలేయర్/ నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్‌ను కూడా అలాగే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే తహసీల్దార్ కార్యాలయంలో ఈ సర్టిఫికెట్ జారీ విషయంలో జాప్యం చోటుచేసుకుంటోంది. ఈ నేపథ్యంలో సంబంధిత వెసులుబాట్లు పొందలేకపోతున్నామని చాలా మంది విద్యార్థులు వాపోతున్నారు.