Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపట్లోనే..
- వికారాబాద్ జిల్లా తాండూర్లోని నెంబర్ వన్ పాఠశాలలో ఘటన
- అధికారుల సమగ్ర విచారణ
- నలుగురిని సస్పెండ్ చేసిన కలెక్టర్
- పరీక్ష విధుల నుంచి ఒకరి తొలగింపు
నవతెలంగాణ-తాండూరు
పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రం వాట్సాప్ గ్రూప్‌లో ప్రత్యక్షం కావడం సంచలనం సృష్టించింది. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపట్లోనే ప్రశ్నాపత్రం బయటకు రావడంతో లీక్ అయినట్టు తీవ్ర చర్చ జరిగింది. అయితే, ఉపాధ్యాయుడు ఫోన్లో ఫొటో తీసి వాట్సాప్‌లో షేర్ చేయడంతో పేపర్ బయటకు వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో సోమవారం జరిగింది. అధికారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తాండూర్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ నెంబర్ వన్ పాఠశాలలో 260 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 258 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఉదయం 9 గంటల ఐదు నిమిషాలకు విద్యార్థులను పరీక్షా కేంద్రం లోపలికి పంపారు. ఉదయం 9:30 నిమిషాలకు పరీక్ష ప్రారంభమైంది. 9:37 నిమిషాలకు ప్రశ్నాపత్రం ప్రభుత్వ ఉపాధ్యాయుని ఫోన్ ద్వారా వాట్సాప్ గ్రూపులోకి వచ్చింది. అయితే, పేపర్ లీకేజీ అనేది పరీక్ష ప్రారంభానికి ముందు జరగలేదని, సీసీ కెమెరాలు మధ్య ఉదయం 9:15 నిమిషాలకు పేపర్ సీల్ ఓపెన్ చేసి విద్యార్థులకు ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. 9 గంటల 35 నిమిషాల తర్వాత రూమ్ నెంబర్ 5లో ఒక విద్యార్థి ఆబ్సెంట్ కావడంతో ఆ విద్యార్థికి సంబంధించిన పేపర్‌ను చీఫ్ సూపరింటెండెంట్‌కు ఇవ్వాల్సిన క్రమంలో ఒక టీచర్ దాన్ని ఫొటో తీసి వాట్సప్ గ్రూప్‌లో పోస్టు చేశారని ఎంఈఓ వెంకటయ్య తెలిపారు.
ఇలా జరిగింది..
నెంబర్-1 స్కూల్లోనే పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్, బయోసైన్స్ టీచర్ బందప్ప పరీక్ష సమయంలో రిలీవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం తెలుగు పేపర్ పరీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో రూమ్ నెంబర్ 5లో ఒక స్టూడెంట్ ఆబ్సెంట్ అయ్యాడు. అతనికి సంబంధించిన పేపర్‌ను ఆ గదిలో ఇన్విజిలేటర్‌గా పని చేస్తున్న శ్రీనివాస్ నుంచి బందప్ప తీసుకున్నాడు. అనంతరం ఆ ప్రశ్నాపత్రాన్ని తన ఫోన్లో ఫొటో తీసి జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ చెంగోల్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ టీచర్ సమ్మప్పకు పంపించాడు. ఈ క్రమంలో అనుకోకుండా తాండూర్ పట్టణంలోని ఒక ప్రెస్ గ్రూప్‌లో కూడా పేపర్ షేర్ కావడంతో విషయం బయటకు వచ్చింది. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విచారించారు. తాము తప్పు చేసినట్టు టీచర్లు బందప్ప, సమ్మప్ప ఒప్పుకున్నారు. అధికారుల ఫిర్యాదు మేరకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు బందప్పపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
ఐదుగురిపై చర్యలు
పేపర్ బయటకు రావడంతో అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి నలుగురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. టీచర్లు బందప్ప, సమ్మప్ప, డిపార్ట్మెంట్ ఆఫీసర్ శివకుమార్, చీఫ్ సూపరింటెండెంట్ గోపాల్‌ను సస్పెండ్ చేశారు. ఇన్విజిలేటర్ శ్రీనివాస్‌ను కూడా పరీక్ష విధుల నుంచి తప్పించారు. రూమ్ నెంబర్-5లో విధులు నిర్వహిస్తున్న ఇన్విజిలేటర్ శ్రీనివాస్.. ఆబ్సెంట్ అయిన విద్యార్థి ప్రశ్నాపత్రాన్ని చీఫ్ సూపరింటెండెంట్‌కు ఇవ్వాల్సి ఉండగా, టీచర్ బందప్పనే చీఫ్ సూపరింటెండెంట్ అనుకొని పొరపాటున ఇచ్చినట్టు శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. ఈ విషయమై పూర్తి విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ పోలీసులను ఆదేశించారు. బందప్పపై గతంలో క్రిమినల్ కేసులు ఉన్నట్టు సమాచారం.