Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో 1,50,000 గుడిసెలు
- ఇంటి నిర్మాణానికి కేంద్రం రూ.10లక్షలు,రాష్ట్రం రూ.5లక్షలు ఇవ్వాలి :తమ్మినేని
- మానుకోట తహసీల్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-మహబూబాబాద్
పేదల ఇంటి నిర్మాణానికి దారి చూపేది ఎర్రజెండేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పేదలు వేసుకున్న 1,50,000 గుడిసెల ఇండ్ల స్థలాలకు పట్టాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదల ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు మొత్తం రూ.15 లక్షలు ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ స్థలాలను వెలికి తీసి బోర్డులు పెట్టాలని కోరారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పేదలు వేసుకున్న గుడిసెలకు 58 జీవో ప్రకారం వెంటనే పట్టాలివ్వాలనీ, 59 జీవో ప్రకారం 500 గజాల భూమి వరకు పాత నామినల్ రుసుముతో రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్‌లో తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ఐదు వేల మందితో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ సుర్ణపు సోమయ్య అధ్యక్షతన నిర్వహించిన సభలో తమ్మినేని మాట్లాడారు. రాష్ట్రంలో పేదలకు సొంతింటి కల కలగానే మిగిలిపోయిందన్నారు. గత ఎన్నికలకు ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు భార్యాపిల్లలు లేరని చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ 300 కోట్లతో ఇల్లు కట్టుకుంటున్నారనీ, పేదల ఇంటి నిర్మాణానికి మాత్రం 30 గజాలు ఇవ్వడానికి చేతులు రావడం లేదని విమర్శించారు. 2022 నాటికి దేశంలో పేదలందరికీ ఇందిరా ఆవాజ్ యోజన పథకం కింద ఇండ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించిన నరేంద్ర మోడీ ఎంతమందికి ఇండ్లు నిర్మించి ఇచ్చారని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ తాను ఎంఏ పాసైనట్టు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఎన్నికల అఫిడవిట్లో సమర్పించినట్టు ప్రచారం జరుగుతున్నదనీ, దీనికి ప్రధాని ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పొట్ట చేత పట్టుకొని పట్టణాలకు వలస వచ్చిన పేదలు ఇల్లు అద్దెకు తీసుకోవడం ఒక ఎత్తయితే, అద్దె కట్టుకోవడం మరొక సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ పట్టణంలో 5 వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయనీ, వాటిని వెలికి తీసి పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. మానుకోట తహసీల్దార్ కార్యాలయం అక్రమాలకు కేంద్రంగా మారిందనీ, అవినీతి అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తానే స్వయంగా ఫిర్యాదు చేస్తానని తెలిపారు. కేసులకు, జైళ్లకు భయపడేది లేదనీ, పేదలకు ఇండ్ల స్థలాలు దక్కేంతవరకు సీపీఐ(ఎం) పోరాడుతుందని స్పష్టం చేశారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే.. పేదలకు భూములు ఇప్పించేందుకు ముందుకు రావాలన్నారు. చలిచీమలు ఏకమై పామును ఎదిరించినట్టుగా భూ పోరాటంలోని గుడిసె వాసులంతా ఐక్యంగా ఉండి అధికారులను ఎదిరించాలని పిలుపునిచ్చారు.
కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భూ పోరాటాలు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. నాడు పార్టీ ఆధ్వర్యంలో వేసుకున్న గుడిసెల కాలనీలే నేడు మానుకోటలో పేదలకు అండగా నిలిచాయని అన్నారు. వరంగల్‌లో మాజీ మంత్రి హయగ్రీవాచారి ఆక్రమించుకున్న రూ.1000 కోట్ల విలువైన 22 ఎకరాల ప్రభుత్వ భూమిని కోర్టులో గెలిచి ప్రభుత్వానికి అప్పగించిన ఘనత సీపీఐ(ఎం)దేనని తెలిపారు. వరంగల్‌లో జక్కలొద్దిలో 250 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి పేదలతో గుడిసెలు వేయించినట్టు చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చెరువు శిఖం, పంచరాయి, పోరంబోకు, బంజరు లాంటి ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూకబ్జాదారులు.. ఆక్రమించుకున్నారని, వాటన్నింటిని సర్వే చేసి వెలికితీయాలన్నారు. మానుకోటలో గుడిసెలు వేసుకున్న పేదలపైకి రెవెన్యూ అధికారులు పోలీసులను ఉసిగొల్పి లాఠీలతో రక్తం వచ్చేలా కొట్టించారన్నారు. కేసులు పెట్టి జైలుకు పంపారనీ, అయినా భయపడకుండా పోరాటాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు. అధికారులు, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా భూ పోరాటాలు ఆపేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, నాయకులు గునిగంటి రాజన్న, అల్వాల వీరన్న, సమ్మెట రాజమౌళి, అల్లి శ్రీనివాస్ రెడ్డి, పాల బిందెల మల్లయ్య, హేమ నాయక్, తదితరులు పాల్గొన్నారు.