Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళలపై పెరుగుతున్న దాడులు
- పీవోడబ్య్లూ రాష్ట్ర అధ్యక్షులు ఝాన్సీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యాన్ని పారించటం వల్లనే మహిళలపై లైంగిక దాడులు పెరిగి పోతున్నాయని ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్య్లూ) రాష్ట్ర అధ్యక్షులు జి ఝాన్సీ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్లోని మార్క్స్ భవన్లో ఆ సంఘం రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ మద్యం మత్తులో మహిళలపై కుటుంబ హింస, లైంగిక దాడులు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే మద్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఇప్పుడు మూడు రెట్లు పెరిగిందన్నారు. సుమారు రూ. 35 వేల కోట్లు ఆదాయాన్ని సర్కారు ఆర్జించిందని తెలిపారు. నేరాలు అరికట్టేందుకు నిరంతరం శ్రమిస్తున్నట్టు అధికారులు చెబుతున్నప్పటికీ..క్రైం రేటు పెరిగిందని తెలిపారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలు చేయాలనీ, తద్వారా పెరిగిన హింసను అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మంగ, ఉపాధ్యక్షులు అనసూయ, జ్యోతి, కార్యదర్శి ఆర్ సీత, గీత తదితరులు పాల్గొన్నారు.