Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసులకు హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ - హైదరాబాద్
చింతపండు నవీన్‌కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై నమోదైన కేసుల్లో బెయిల్ ఇవ్వాలనే పిటిషన్లపై మంగళవారం విచారణ జరగనున్న నేపథ్యంలో ఆయనపై ఆ కేసుల్లో పోలీసులు వారెంట్ జారీ చేయరాదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తిరిగి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది. విచారణను ఈ నెల పదో తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ విజరుసేన్‌రెడ్డి సోమవారం ఆదేశాలిచ్చారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తన భర్తను అరెస్టు చేశారని, ఏడేండ్లలోపు శిక్షలు పడే కేసుల్లో నోటీసులివ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించినా పోలీసులు వాటిని అమలు చేయలేదని నవీన్ భార్య మాతమ్మ వేసిన పిటిషన్ తరఫున లాయర్ వాదించారు. ఏదోఒక విధంగా నవీన్‌ను ఇబ్బందులకు గురిచేయాలంటూ పోలీసులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. మద్యం కుంభకోణం పేరుతో కేసీఆర్, కేటీఆర్, కవితలపై సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టింగ్ పెట్టారంటూ ప్రభుత్వ లాయర్ వివరించారు.
వీఆర్వోల కేసు 20కి వాయిదా
ధరణి పోర్టల్ ఆవిర్భావం చేసిన కారణంగా వీఆర్వోలతో పనిలేదని, అందుకే వారిని వేరే శాఖలకు బదిలీ చేశామని ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది. వేరే శాఖలకు పంపే ముందు వీఆర్వోల అభిప్రాయాలు తీసుకోలేదని పిటిషనర్ల వాదన. గతేడాది జులై 23న ప్రభుత్వం జారీ చేసిన జీవోనెంబర్ 121ను రద్దు చేయాలన్నారు. 2007, జనవరి 31న అప్పటి ప్రభుత్వం ఇదే తరహా జీవో ఇస్తే హైకోర్టు రద్దు చేసిందని గుర్తు చేశారు. ఈ వివరాలను నమోదు చేసుకున్న హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది.
కౌంటర్ దాఖలు చేయండి
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గత నెలలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గత నెల 17న స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో ఆరుగురు మరణించారు. ఈ ఘటనపై దినపత్రికల్లో వచ్చిన వార్తలను హైకోర్టు సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, డీజీపీ, హైదరాబాద్ సీపీ తదితరులకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం సోమవారం నోటీసులు జారీ చేసింది. విచారణను జూన్ 26వ తేదీకి వాయిదా వేసింది.