Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాతంత్ర, లౌకిక, వామపక్ష కూటమిదే అధికారం : కూనంనేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. ప్రజాతంత్ర, లౌకిక, వామపక్ష కూటమిదే అధికారమని స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ మఖ్దూం భవన్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలు ప్రజా సంఘాల ఆఫీస్ బేరర్ల సమావేశాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటి నర్సింహ్మా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ఈనెల 14 నుంచి వచ్చేనెల 14 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో జరిగే ఇంటింటికీ సీపీఐ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇందుంలో భాగంగా ఈనెల14న హైదరాబాద్, ఇందిరాపార్కు వద్ద జరిగే ప్రారంభ సభను, వచ్చేనెల 14న కొత్తగూడెంలో లక్షలాది మందితో పెద్ద ఎత్తున నిర్వహించే ముగింపు బహిరంగ సభను జయప్రదం చేసేందుకు పార్టీ, ప్రజా సంఘాల శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా పాలకులు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం సమరశీలంగా ఉద్యమించాలన్నారు. బీజేపీ హఠావో-దేశ్‌కో బచావో నినాదంతో ప్రజలను చైతన్య పరుస్తామని చెప్పారు. దేశంలో బీజేపీకి కొన్ని రాష్ట్రాల్లోనే అధికారం ఉందని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా బలం లేని రాష్ట్రాల్లో కూడా అధికారాన్ని దక్కించుకోవాలనే దుర్మార్గపు విధానాలను ప్రోత్సహిస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నదని విమర్శించారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్‌పాషా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, ఎన్ బాలమల్లేష్ తదితరులు పాల్గొన్నారు.