Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 నుంచి జాతాల రూపంలో ఉద్యమిస్తాం : తెలంగాణ మెడికల్, సేల్స్ రిప్రజెంటెటీవ్స్ యూనియన్
నవతెలంగామ బ్యూరో - హైదరాబాద్
ఫార్మా కంపెనీల లాభాల కోసమే కేంద్రంలోని బీజేపీ సర్కారు 380 ఔషధాల ధరలను 10 శాతం నుంచి 12.2 శాతానికి పెంచిందని తెలంగాణ మెడికల్, సేల్స్ రిప్రజెంటీటివ్స్ యూనియన్ (టీఎంఎస్ఆర్యూ) విమర్శించింది. ఈ మేరకు సోమవారం యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్.భానుకిరణ్, ఐ.రాజుభట్ ఒక ప్రకటన విడుదల చేశారు. సామాన్యుల నడ్డి విరిచి వారికి ఆరోగ్యాన్ని అందని ద్రాక్షగా మార్చే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెల 10 నుంచి ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జాతాలు నిర్వహించి ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ప్రజలు ఆరోగ్యంపై చేసే ఖర్చులో 70 శాతం మందులపైనే ఖర్చు చేస్తున్నారనీ, ప్రస్తుత పెంపుతో వారిపై మరింత భారం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది 10 శాతం ధరలను పెంచిన కేంద్రం ప్రస్తుతం మరో 12 శాతం పెంచడం ప్రజారోగ్యంపై బీజేపీకున్న చిత్తశుద్ధిని తెలుపుతున్నదని ఎద్దేవా చేశారు. ఈ అంశంపై ఉద్యమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తామని తెలిపారు. పెంచిన మందుల ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలనీ, మందులపై జీరో జీఎస్టీ అమలు చేయాలని కోరారు. ప్రభుత్వరంగ మందులు, వ్యాక్సిన్ కంపెనీలను పునరుద్ధరించాలనీ, జీడీపీలో ఐదు శాతం వైద్యారోగ్య రంగానికి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.