Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మె నోటీసు ఉపసంహరించుకోండి
- 6 శాతం ఫిట్‌మెంట్‌కు ఓకే
- 'ఎస్మా' పరిధిలో ఉన్నారు..
- మర్చిపోవద్దు : విద్యుత్ ఉద్యోగుల జేఏసీకి యాజమాన్యం లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో ఉద్యోగుల ఖర్చు (ఎంప్లాయీకాస్ట్) పెరిగిందనీ, అందువల్ల ఆరు శాతం ఫిట్మెంట్ మాత్రమే ఇవ్వగలమని టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)కి విజ్ఞప్తి చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సమ్మెలోకి వెళ్తామని ఇచ్చిన సమ్మె నోటీసును ఉపసంహరించుకోవాలని కోరుతూ ఆయన జేఏసీ నాయకత్వానికి సోమవారం లేఖ రాసారు. యాసంగి సీజన్ నడుస్తున్నందున రైతాంగానికి నాణ్యమైన కరెంటు అందించాల్సి ఉందనీ, పదవ తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయనీ, పలు ప్రభుత్వ పోటీ పరీక్షలకు అభ్యర్థులు చదువుకుంటున్నారనీ, సమ్మె వల్ల వీరందరికీ ఇబ్బందులు తలెత్తుతాయని ఆ లేఖలో పేర్కొన్నారు. 6 శాతం ఫిట్మెంట్ ఇస్తేనే విద్యుత్ సంస్థలపై ఏటా రూ.526 కోట్ల ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. 2014లో 30 శాతం, 2018లో 35 శాతం విద్యుత్ ఉద్యోగులకు వేతన సవరణ చేశామని గుర్తుచేశారు. ఉద్యోగుల ఖర్చు పెరిగితే, విద్యుత్ సంస్థలు ఆర్థికంగా మరింత దిగజారుతాయని హెచ్చరించారు. విద్యుత్ సంస్థలు 'ఎస్మా' పరిధిలో ఉన్నాయనీ, ఆరునెలలపాటు సమ్మెలపై నిషేధం ఉన్నదని గుర్తుచేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మరిన్ని చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామనీ, అందువల్ల సమ్మె నోటీసును ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.