Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన
- తొలిరోజు 2,165 మంది గైర్హాజరు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మంగళవారం జరిగే పదో తరగతి పరీక్షను షెడ్యూల్ ప్రకారమే యథాతథంగా నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన స్పష్టం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులెఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒక ప్రకటనలో తెలిపారు.
అనేక అనుమానాలు...
ప్రశ్నాపత్రం బయటకెళ్లిందని అంగీకరించినా ఎలాంటి నష్టం జరగలేదంటూ విద్యాశాఖ ప్రకటించడం పట్ల అనేక అనుమానాలు నెలకొన్నాయి. సీఎస్, డీవో, ఇన్విజిలేటర్లు పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడం నిషేధం. అయినా ఆ ఇన్విజిలేటర్ మొబైల్ ఫోన్‌ను ఎలా తీసుకెళ్లారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. పరీక్ష ప్రారంభమైన తర్వాత 9.37 గంటలకే ప్రశ్నాపత్రం వాట్సాప్ ద్వారా బయటకెళ్లిందా? లేదంటే అంతకంటే ముందుగానే వేరే వాళ్లకు పంపించారా? అనే ప్రశ్న చాలా మందిలో ఉదయిస్తున్నది. ఇంకోవైపు బందెప్ప అనే ఇన్విజిలేటర్ సమ్మప్పకు పరీక్ష ప్రారంభమయ్యాక పంపించడానికి కారణమేంటీ?. 9.35 గంటల తర్వాత విద్యార్థులెవరూ పరీక్ష కేంద్రంలోకి వెళ్లడానికి అవకాశం లేదు. పరీక్ష కేంద్రం నుంచి బయటికెళ్లడానికి కూడా వీల్లేదు. మరి ఏ ఉద్దేశంతో ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసి వాట్సాప్ ద్వారా పంపించారన్నది తెలియాల్సి ఉన్నది. పాఠశాల విద్యాశాఖ అధికారులు పదో తరగతి పరీక్షల నిర్వహణ పట్ల ఎంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారనే దానికి ఈ ఘటన నిదర్శనం. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
రెగ్యులర్ విద్యార్థుల్లో 99.60 శాతం హాజరు
పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2,652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. రెగ్యులర్ విద్యార్థులు 4,85,954 మంది దరఖాస్తు చేసుకోగా, 4,84,019 (99.60 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. 1,935 (0.40 శాతం) మంది గైర్హాజరయ్యారని తెలిపారు. ప్రయివేటు విద్యార్థుల్లో 1,096 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 866 (79.01 శాతం) మంది పరీక్ష రాశారని వివరించారు. 230 (20.99 శాతం) మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. మొత్తం 4,87,050 మంది దరఖాస్తు చేసుకోగా, 4,84,885 (99.56 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. మొదటిరోజు పరీక్షకు 2,165 (0.44 శాతం) మంది గైర్హాజరయ్యారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.