Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వానికి టీడబ్ల్యూజేఎఫ్,హెచ్‌యూజే విజ్ఞప్తి
- ప్రెస్‌క్లబ్‌లో సంతకాల సేకరణ
నవతెలంగాణ - హైదరాబాద్
రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు కేటాయించే విషయమై ప్రభుత్వం తన విధానాన్ని ప్రకటించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్‌యూజే) డిమాండ్ చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది జర్నలిస్టులు ఇండ్లస్థలాల కోసం ఎదురుచూస్తున్నారని అభిప్రాయపడ్డాయి. సోమవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో టీడబ్ల్యూజేఎఫ్, హెచ్‌యూజే సంయుక్తంగా 'జర్నలిస్టుల ఇండ్లస్థలాల కోసం సంతకాల సేకరణ' కార్యక్రమాన్ని నిర్వహించాయి. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాతోపాటు వందలాది మంది జర్నలిస్టులు ఇందులో పాల్గొన్నారు. సంఘాలు ఏర్పాటు చేసిన భారీ బ్యానర్‌పై సంతకాలు చేశారు. అలాగే జాబితాల రూపకల్పనకు గాను జర్నలిస్టుల పేర్లు, పత్రిక, హోదా, చిరునామాలు, మొబైల్నంబర్లు సేకరించారు. అలాగే ఇండ్లస్థలాలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా హాజరైన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బి.బసవపున్నయ్య మాట్లాడుతూ ఇండ్లస్థలాల కోసం గత 35 ఏండ్లుగా రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదురుచూస్తున్నారని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం స్పందిస్తుందని ఆశించామనీ, ఇంతవరకు తన వైఖరీ చెప్పలేదని వ్యాఖ్యానించారు. లాక్డౌన్ తర్వాత అనేక సమస్యలను జర్నలిస్టులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని అన్నారు. హెచ్‌యూజే అధ్యక్షులు బి.అరుణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సిగేచర్ క్యాంపెయిన్‌లో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. ఆనందం, విజయానంద్, గుడిగ రఘు, బి. రాజశేఖర్, కార్యదర్శులు షేక్ సలీమ, ఈ. చంద్రశేఖర్, బి.జగదీశ్ , తన్నీరు శ్రీనివాస్, కొప్పు నిరంజన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. విజయ, కె.రామకృష్ణ, పి.పాండు, బీవీఎన్ పద్మరాజు, పి.మధుకర్, పి.నాగవాణి, ఎం రమేశ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మెరుగు చంద్రమోహన్, రాష్ట్ర నాయకులు పి.బాపూరావు, హెచ్‌యూజే నాయకులు సర్వేశ్వర్రావు, కె. లలిత, క్రాంతి, మాధవరెడ్డి పాల్గొన్నారు.