Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్పత్తి వ్యయం తగ్గించండి
- కేంద్రం వేలం పెట్టిన 4 బొగ్గు గనులు మనకే...: సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్ వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి కాలరీస్ కంపెనీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.32,830 కోట్ల టర్నోవర్ సాధించినట్టు ఆ సంస్థ సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం(2021-22)లో సాధించిన రూ.26,619 కోట్ల రూపాయల టర్నోవర్‌పై 23 శాతం వద్ధిని నమోదు చేశామన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 750 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలనీ, నాలుగు కొత్త ప్రాజెక్టుల నుండి 100 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడం కీలకమని సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్ తెలిపారు. సోమవారం సింగరేణి భవన్లో జరిగిన సంస్థ డైరెక్టర్లు, సలహాదారులు, ఏరియా జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్రం వేలంలో పెట్టిన నాలుగు బొగ్గు బ్లాకులు సింగరేణికే వచ్చే అవకాశం ఉందన్నారు. మరో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ తో పాటు భారీగా సోలార్ విస్తరణ చేపట్టాలనీ, ఉత్పత్తి వ్యయం తగ్గించి, ఉత్పాదకత పెంచుకుంటేనే మనుగడ సంస్థ మనుగడ నిలకడగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగులు, అధికారులు, కార్మిక సంఘాల నాయకులకు అభినందనలు తెలిపారు. రాష్ట్రావతరణ తర్వాత 10 కొత్త గనులను ప్రారంభించుకొని, థర్మల్, సోలార్ విద్యుత్ రంగాల్లో కూడా ప్రవేశించడంతో ఈ అభివద్ధి సాధ్యమైందన్నారు. బొగ్గు అమ్మకాలను 8 రాష్ట్రాలకు విస్తరింపచేశామన్నారు. బొగ్గు అమ్మకాల ద్వారా రూ.28,459 కోట్లు, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా జరిపిన విద్యుత్ అమ్మకాల ద్వారా రూ.4,371 కోట్ల టర్నోవర్ సాధ్యమైందని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 75 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, వచ్చే రెండేండ్లలో 80 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని సింగరేణి చేరుకోనున్నదనీ, మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తయి ఉత్పత్తి ప్రారంభిస్తుందనీ తెలిపారు. 2026-27 నాటికి 50 వేల కోట్ల టర్నోవర్ మైలురాయిని సింగరేణి చేరుకుంటుందన్నారు. సమావేశం లో డైరెక్టర్లు ఎన్. బలరామ్ (ఫైనాన్స్ అండ్ పర్సనల్), డైరెక్టర్ (ఈ అండ్ ఎం) డి.సత్యనారాయణ రావు, ఎన్.వి.కె. శ్రీనివాస్ (ఆపరేషన్స్), అడ్వైజర్ సురేంద్ర పాండే (ఫారెస్ట్రీ), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ జె. ఆల్విన్, జీఎం (కో ఆర్డినేషన్) ఎం.సురేష్, జి.ఎం(సీపీపీ) సి.హెచ్. నరసింహారావు, జి.ఎం(మార్కెటింగ్ ) కె. సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.