Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి 38 మంది చిన్నారుల్లో ఒకరికి
- అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలి : ప్రభుత్వానికి డాక్టర్ ఇ.వి.వి రాజశేఖర్ సూచన
- ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆటిజం డే
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆటిజం అనే న్యూరలాజికల్ సమస్య కరోనా మాదిరిగా పెరిగిపోతున్నదని ప్రముఖ సైకాలజిస్ట్, ఆటిజం థెరపిస్ట్ డాక్టర్ ఇ.వి.వి.రాజశేఖర్ హెచ్చరించారు. 2000 నుంచి ఆటిజం సోకినవారి సంఖ్య 241 శాతం పెరగిందని తెలిపారు. 2000లో ప్రతి 160 మందిలో ఒకరికి ఉండగా..2010 నాటికి 68 మందిలో ఒకరికి, 2018 నాటికి 44 మందిలో ఒకరికి, ప్రస్తుతం ప్రతి 38 మందిలో ఒకరికి ఆటిజం వచ్చిందని తెలిపారు.
అంతర్జాతీయ ఆటిజండేను పురస్కరించుకుని ఎన్పీఆర్డీ రాష్ట్ర కార్యదర్శి ఏం.అడివయ్య అధ్యక్షతన హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'ఆటిజం సమస్య - ప్రభుత్వాల బాధ్యత' అనే అంశంపై నిర్వహించిన సదస్సులో రాజశేఖర్ కీలకోపన్యాసం ఇచ్చారు. ఆటిజం ఉన్న పిల్లలను గుర్తించడం, వారితో ఏ విధంగా వ్యవహరించాలి? ఆటిజంలో ఉన్న రకాలేంటి? ఆటిజం కలిగిన పిల్లలను- సాధారణ పిల్లలతో కలిపి ఒకే బడిలో కొనసాగించాల్సిన అవసరత తదితర అంశాలను కూలంకుశంగా వివరించారు. ఆటిజం జబ్బు కాదనీ, దాన్ని నయం చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఆటిజం వేరు, మానసిక వైకల్యం వేరని తెలిపారు. శిశువు జన్మించిన 36 నెలల తర్వాత మాత్రమే ఆటిజాన్ని నిర్ధారించవచ్చన్నారు. చైల్డ్, క్లినికల్, రిహాబిలిటేషన్ సైకాలజిస్టులు మాత్రమే ఆటిజాన్ని గుర్తించగలుగుతారని వివరించారు. భవిష్యత్తులో ఇంటింటిని ఆటిజం కేసులు ఇబ్బంది పెట్టే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఆటిజం సోకిన పిల్లలను ప్రారంభదశలోనే గుర్తిస్తే ప్రయోజనం ఎక్కువగా ఉంటుందనీ, ఇందుకోసం పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు తదితరులకు శాస్త్రీయమైన శిక్షణ అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చొరవ చూపిస్తే వారికి శిక్షణ ఇచ్చేందుకు తాము సిద్ధమని ప్రకటించారు.శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి శ్రీదేవి ప్రసాద్ మాట్లాడుతూ 38 ఏండ్లుగా ఆటిజం రంగంలో సేవలందిస్తున్నట్టు తెలిపారు. 63 కారణాల ద్వారా ఇలాంటి పిల్లలు జన్మిస్తున్నట్టు గుర్తించారన్నారు. భవిష్యత్తులో ప్రతి ఏడుగురిలో ఒకరు ఆటిజంతో పుట్టే ప్రమాదముందంటూ నిపుణులు చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటిజాన్ని వైకల్యంగా గుర్తించారనీ, అలాంటి వారిని తగిన రీతిలో ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరారు. అడివయ్య మాట్లాడుతూ.. ఆటిజాన్ని అరికట్టేందుకు వీలుగా ఐక్యరాజ్యసమితి ఒప్పందంలో భారతదేశం సంతకం చేసిందనీ, ఆ మేరకు చర్యలు మాత్రం తీసుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షల మంది ఆటిజం కలిగిన వారున్నప్పటికీ, వికలాంగుల శాఖ కమిషనర్ శైలజ రాష్ట్రంలో ఈ సమస్య అంతతీవ్రంగా లేదంటూ హైకోర్టులో చెప్పారని విమర్శించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఆటిజం థెరపీ సెంటర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్పీఆర్డీ పక్షాన జిల్లాలు, మండలాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్, కోశాధికారి ఆర్.వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.