Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్షేత్రస్థాయిలో సమస్యలకు పరిష్కారమెలా?
- చిరుద్యోగుల బాధలు వినేదెవరు?
- బోధనాస్పత్రుల సూపరింటెండెంట్ల తీరుపై విమర్శలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేవలం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశా లతో సమస్యలు పరిష్కారం కావు. వ్యవస్థలో పాతుకుపోయిన అంసతప్తిని తొలగించేందుకు క్షేత్రస్థాయిలో పని చేసే వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. నిధులు కేటాయిస్తున్నప్పటికీ ఆ మేరకు ఫలితం మాత్రం రావడం లేదు. కింది స్థాయిలో ఉద్యోగులు మరింత ఉత్సాహంగా పని చేయాలి. రోగుల్లో పెరిగిన నమ్మకాన్ని కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలి. ఇలాంటి ఆలోచనలు, నిర్ణయాలతోనే వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు నెలవారీ సమీక్షలకు శ్రీకారం చుట్టారు. విభాగాల వారీగా ప్రతి నెల సమీక్షలు నిర్వహిస్తూ, నిర్దేశించిన లక్ష్యాలపై ఆరా తీస్తూ, పనితీరు మెరుగైన వారిని అభినందిస్తూ, వెనుకబడిన వారికి సూచనలు, సలహాలిస్తూ జవాబుదారీ తనాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా క్రమం తప్పకుండా డీఎంఈ, డీహెచ్, టీవీవీపీ, నిమ్స్, నిలోఫర్ తదితర విభాగాల వారీగా నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాలు ప్రభుత్వానికి మంచి ఫీడ్ బ్యాక్‌ను ఇచ్చాయనే చెప్పాలి. ఈ సమీక్షల్లో నుంచి వచ్చిన సమాచారం తోనే సి-సెక్షన్లను తగ్గించేందుకు సహజ ప్రసవాలు చేసే వారికి ప్రోత్సాహకాలు అందివ్వాలని నిర్ణయిం చారు. మంత్రి వరకే పరిమితమైన సమీక్షలు కింద స్థాయిలో అధికారులు అందుకోవడం లేదనే వాదన వినపడుతోంది. ఆయా ఆస్పత్రుల సూపరింటెండెం ట్లు, అధికారులు రౌండ్స్‌కు తప్పనిసరిగా వెళ్లాలని మంత్రి ఆయా సందర్భాల్లో ఆదేశిస్తూనే ఉన్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఇప్పటికీ చాలా ఆస్పత్రుల్లో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. సమీక్షలు చేయరు అనే విమర్శలే సూపరింటెండెంట్లపై వినపడుతు న్నాయి. దీంతో ఒకరిద్దరు ఆస్పత్రి అధికారులు చెప్పే విషయాలపైనే పూర్తి ఆధారపడుతూ ''వచ్చామా... వెళ్లామా'' అన్నట్టుగా కొందరి వ్యవహారం తయా రైంది. కింద స్థాయిలో సమస్యలు నెలల తరబడి పేరుకుపోతున్నా..... వాటికి మోక్షం లభించడం లేదు. పేద ప్రజలకు కోట్లాది రూపాయలు వెచ్చించి మెరుగైన వైద్యం అందించాలనే ప్రభుత్వ సంకల్పానికి ఇలాంటి వారి చర్యలు ఆటంకంగా మారుతున్నాయి. తాగునీరు, పారిశుధ్యం, సెక్యూరిటీ సమస్యలు, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో రోగుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతూనే ఉన్నది.
మంత్రి మాదిరిగా....
మంత్రి నిర్వహిస్తున్నట్టు విభాగాల వారీగా నెలవారీ సమీక్షలు ఆస్పత్రుల్లోనూ నిర్వహిస్తే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే వైద్యారోగ్యశాఖ ప్రక్షాళన, పనితీరు మెరుగు పరిచేందుకు మంత్రి విస్తృతస్థాయి సమావేశాలు దోహదపడ్డాయని వారు అభిప్రాయపడుతున్నారు. అదే తరహాలో ఆయా ఆస్పత్రుల సూపరింటెం డెంట్లు కేవలం ఒకరిద్దరు ఆర్‌ఎంఓలు, పాలనాధికా రుల సూచనలకే పరిమితం కాకుండా డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య, ఇతర విభాగాల వారీగా కనీసం నెలకు ఒకసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తే పనితీరు మరింత మెరుగవు తుందని సూచిస్తున్నారు. సూపరింటెండెంట్ల స్థాయిలో ఉన్నవారు రెగ్యులర్ రౌండ్స్‌కు వెళ్లడం, క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తే క్షేత్రస్థాయి ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెరుగుతుందనీ, కింద స్థాయిలో సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారమై రోగుల్లో అసంతృప్తి పోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.