Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలోనే అమరజ్యోతిని ప్రారంభిస్తాం : సీఎం కేసీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ స్వయం పాలన ఆకాంక్షలకు ఊపిరిలూదిన సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం చిరస్మరణీయమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని సీఎం వారి త్యాగాలను స్మరించుకున్నారు. దొడ్డి కొమురయ్య అమరత్వం అందించిన చైతన్య స్పూర్తి మలి దశ తెలంగాణ ఉద్యమంలోనూ కొనసాగిందని సీఎం తెలిపారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధనకోసం పార్లమెంటరీ పంథాలో సాగిన శాంతియుత పోరాటంలో సబ్బండ వర్గాలు తమ వంతుగా ఉద్యమించాయని, తమ ఆకాంక్షలను చాటడంలో దొడ్డి కొమురయ్య స్పూర్తి ఇమిడి వున్నదని సీఎం ఒక ప్రకటనలో తెలిపారు. అమరవీరుల త్యాగాలను తెలంగాణ ప్రభుత్వం నిత్యం స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకోసం శ్రమిస్తున్నదని తెలిపారు. బీసీ కుల వత్తులను పరిరక్షిస్తూ వారిని ప్రగతి పథంలో నడుపేందుకు, వారికి అన్ని విధాలా సాయం చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయని తెలిపారు. గొల్ల కుర్మల అభివృద్ధి కోసం చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం వారి ఆర్థిక స్వావలంబనకు దోహదం చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని గుర్తుచేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో అధికభాగం లబ్దిదారులు బీసీ బిడ్డలే కావడం గొప్ప విషయమని వివరించారు. ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలు, ఆసరా ఫించన్లు, రైతుబంధు సహా అనేక పథకాలు బీసీల ఆత్మగౌరవాన్ని, ఆర్థిక గౌరవాన్ని పెంపొందిం చాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలతో తెలంగాణలో బీసీల స్థితిగతులు గుణాత్మకంగా పురోగమించాయని, వారి ప్రగతి సామాజిక ప్రగతికి బాటలు వేసిందని పేర్కొన్నారు. నేడు దేశ అర్థిక వ్యవస్థకే వెన్నుదన్నున ందించే రీతిలో తెలంగాణ సబ్బండ కులాలు ముందంజలో వున్నాయని వివరించారు. నాటి సాయుధపోరాట కాలం నుంచి నేటి మలి దశ తెలంగాణ ఉద్యమకాలం వరకు దొడ్డికొమురయ్య వంటి తెలంగాణ అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకుంటూ, వారి ఆశయాల సాధనలో ముందు కు సాగుతున్నామని సీఎం తెలిపారు. అమరుల సంస్మరణార్థం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అమరజ్యోతి త్వరలోనే ప్రారంభం కానున్నదని సీఎం ప్రకటించారు.. దొడ్డి కొమురయ్య త్యాగానికి గుర్తుగా ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఘన నివాళులర్పిస్తున్నదని తెలిపారు.