Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్పీఎస్సీ కార్యాలయంలోనే చైర్మెన్ జనార్ధన్‌రెడ్డి స్టేట్మెంట్ రికార్డు
నవతెలంగాణ-సిటీబ్యూరో
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సోమవారం టీఎస్పీఎస్సీ చైర్మెన్ జనార్ధన్‌రెడ్డి స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేశారు. అదనపు సీపీ, సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్, ఏసీపీ నర్సింగ్‌రావు నేతృత్వంలో మధ్యాహ్నం టీఎస్పీఎస్సీ కార్యాలయానికి చేరుకున్న సిట్ బృందం వివిధ అంశాలపై సుదీర్ఘంగా వివరాలు సేకరించినట్టు తెలిసింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ భద్రత, పర్యవేక్షణలో చైర్మెన్, సెక్రెటరీ, సెక్షన్ అధికారుల మధ్య పూర్తిగా సమన్వయలోపం ఉన్నట్టు సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలిసింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ బాధ్యత చైర్మెన్‌పై ఉండటంతో ఇందుకు సంబంధించి జనార్ధన్‌రెడ్డిని వివరణ కోరినట్టు తెలిసింది. కమిషన్‌లో పనిచేసే ఉద్యోగుల విధివిధానాలు, ఎవరెవరు ఏయే బాధ్యతలు నిర్వహిస్తారు? అనే పలు అంశాలపై టీఎస్పీఎస్సీ కార్యాలయంలోనే సిట్ విచారణ కొనసాగించింది. జనార్థన్‌రెడ్డి చెప్పిన సమాచారాన్ని సిట్ అధికారులు రికార్డు చేసినట్టు తెలిసింది. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో అత్యంత రహస్యంగా ఉండాల్సిన ప్రశ్నాపత్రాలు అంత సులువుగా బయటకు రావని, ఇందులో పెద్దల హస్తం ఉందని సిట్ అధికారులు అనుమానించారు. ఈ క్రమంలో ఈ కేసులో ఇప్పటివరకు 15మందిని అరెస్టు చేసిన అధికారులు పలువురిని విచారించిన విషయం తెలిసిందే. దర్యాప్తు అంతా ప్రశ్నాపత్రాలు లీక్ కావడం, అవి ఎవరెవరికి వెళ్లాయి, ఎంత మేరకు ఆర్థిక లావాదేవీలు జరిగాయి అనే కోణంలో కొనసాగింది. ఈ క్రమంలో కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మిని పది దఫాలుగా సుమారు 20గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. అంతేకాకుండా శనివారం టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, కమిషన్ సభ్యులు లింగారెడ్డిని సైతం వేర్వేరుగా విచారించిన విషయం తెలిసిందే. తాజాగా జనార్థన్‌రెడ్డి స్టేట్మెంట్ను రికార్డు చేసిన సిట్ అధికారులు రిపోర్టును సీల్డ్ కవర్లో ఈనెల 11వరకు న్యాయస్థానంలో అందజేయనున్నట్టు తెలిసింది. ఇదిలావుండగా టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై ఈడీ కేసు నమోదు చేయడం మరింత సంచలనంగా మారింది.
ముగ్గురి కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి
ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మరో ముగ్గురి కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ప్రశాంత్, రాజేందర్, తిరుపతయ్యను కస్టడీకి ఇవ్వాలని సిట్ నాంపల్లి కోర్టును కోరింది. ఈ మేరకు ముగ్గురి నిందితులను మూడు రోజులపాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో ముగ్గురినీ మంగళవారం చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకోనున్నారు.