Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 9న సీపీఐ, సీపీఐ(ఎం) కార్యకర్తల సంయుక్త సమావేశం
- హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌గ్రౌండ్ వేదిక
- ముఖ్యఅతిథులుగా ఏచూరి, రాజా, రాఘవులు, నారాయణ
- హాజరు కానున్న మండల, జిల్లా, రాష్ట్ర నాయకులు
- తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే తొలిసారి
- సంయుక్త ప్రెస్మీట్లో తమ్మినేని, కూనంనేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీపీఐ, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఈనెల తొమ్మిదో తేదీన చారిత్రక సమ్మేళనం జరగనుందని ఆయా పార్టీల రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం చెప్పారు. హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ దీనికి వేదిక అవుతుందన్నారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ కార్యదర్శి కె నారాయణ ముఖ్యఅతిథులుగా హాజరవుతారని చెప్పారు. మండల, జిల్లా, రాష్ట్రస్థాయి నాయకులంతా ఈ సమ్మేళనంలో పాల్గొంటారని వివరించారు. ఇలాంటి సమావేశం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే తొలిసారి అని అభివర్ణించారు. వారిని మరింత ఐక్యం చేసేందుకు రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు ఇది సంకేతమవుతుందని, మంచి పరిణామాలకు దోహదపడుతుందని అన్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య మరింత ఐక్యత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ఐక్య పోరాటాలు చేస్తామన్నారు. ఉద్యమాలు చేస్తూనే సీట్ల విషయంలో ఎలాంటి తేడా లేకుండా రాబోయే ఎన్నికల్లో సీపీఐ, సీపీఐ(ఎం) కలిసే ముందుకు సాగుతాయని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతామని చెప్పారు. రాష్ట్రంలో ఆ పార్టీని అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించడం కోసమే బీఆర్ఎస్కు మద్దతిచ్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సిట్, కేంద్రంలో ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలపై అనుమానాల నేపథ్యంలో టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో సీపీఐ, సీపీఐ(ఎం) సంయుక్తంగా విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశాయి.
చట్టసభల్లో ప్రజావాణి వినిపించడమే మా లక్ష్యం : తమ్మినేని
ప్రజా సమస్యలపై ఐక్య ఉద్యమాలను నిర్మిస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్తో సీట్ల సర్దుబాటు కుదుర్చుకునే అవకాశముందన్నారు. లేదంటే ఉభయ కమ్యూనిస్టులు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. చట్టసభల్లో ప్రజావాణి వినిపించడమే తమ లక్ష్యమని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సీపీఐ, సీపీఐ(ఎం) కీలక పాత్ర పోషించాలని, తమ బలాన్ని పెంచుకుంటామని, ఆ దిశగా ముందుకు సాగుతామన్నారు. వామపక్ష భావజాలం, తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించిన ఈ గడ్డపై బీజేపీ అడుగుపెట్టేందుకు ప్రయత్నించడం దుస్సాహాసమేనని అన్నారు. ఆ పార్టీ దేశానికి ప్రమాదకర శక్తిగా మారిందన్నారు. రాజ్యంగాన్ని ధ్వంసం చేస్తున్నదని విమర్శించారు. 2024లో ఆ పార్టీ మళ్లీ గెలిస్తే ఈ దేశం విచ్ఛిన్నమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే బీజేపీ వ్యతిరేక శక్తులను ఐక్యం చేసే క్రమంలోనే రాష్ట్రంలో ఆ ప్రయత్నాలను చేస్తున్నామని వివరించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటును ప్రణాళిక ప్రకారమే జరిగిన కుట్రగా అభివర్ణించారు. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని చెప్పారు. ఎమ్మెల్సీ కవిత మద్యం కుంభకోణంలో తప్పు చేస్తే ఆమెను విచారించినా, శిక్షించినా తమకు అభ్యంతరం లేదని, అలాంటి చర్యలను సమర్థిస్తామని అన్నారు. కానీ అరెస్ట్, విచారణ పేరుతో వేధింపులు, బెదిరింపులకు పాల్పడి ప్రతిపక్షాలను లొంగదీసుకునే చర్యలను తీవ్రంగా ఖండించారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీపై ప్రతిపక్షాలు రాజకీయాలకతీతంగా పోరాటం చేయాలన్న షర్మిల ప్రతిపాదన మంచిదేనని అన్నారు. అయితే అదానీ అక్రమాలు, మోడీ అప్రజాస్వామిక విధానాలు ఆమెకు ఎందుకు గుర్తు రావడం లేదని ప్రశ్నించారు. ఆమె కేసీఆర్‌నే లక్ష్యంగా చేసుకున్నారు తప్ప మోడీని ఎందుకు విమర్శించడం లేదని అడిగారు.
కేంద్రంలో నయా ఫాసిస్టు ప్రభుత్వం : కూనంనేని
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నయా ఫాసిస్టు విధానాలను అవలంభిస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. కులం, మతం, జాతి పేరుతో సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నదని చెప్పారు. మోడీ తరహాలో గతంలో ఏ ప్రధాని ఈ స్థాయికి దిగజారలేదని అన్నారు. ఆయన్ని విమర్శిస్తే బీసీలను అవమానపర్చినట్టుగా ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. రాహల్ గాంధీ కేసును దారిమళ్లించేందుకే బీసీలను అవమానపర్చడమంటూ మోడీ మాట్లాడారని విమర్శించారు. ప్రధాని అంటే రాజనీతిజ్ఞుడిగా ఉండాలని, కానీ కిందిస్థాయి రాజకీయ నాయకుని కంటే దిగజారిపోయారని అన్నారు. ప్రధాని విద్యార్హతపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తుపెడితే సమాధానం ఇవ్వకపోగా రూ.25వేలు జరిమానా విధించడం ఏమిటనీ, ఈ దేశం ఎటు పోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నదని విమర్శించారు. గుజరాత్లో న్యాయవ్యవస్థ బీజేపీ వ్యవస్థగా మారిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో తమ కంటే పోరాటం చేసే మొనగాళ్లు ఎవరున్నారని ప్రశ్నించారు. పోడు భూములకు పట్టాలిస్తున్నారంటే ఎర్రజెండా పోరాటాల వల్ల కాదా?అని అడిగారు. దొంగపోరాటాలు చేసేవారు తమను విమర్శిస్తారా? అని ప్రశ్నించారు. ప్రజల కోసమే తాము పని చేస్తామని, కొన్ని శక్తులు కమ్యూనిస్టు పార్టీల కీర్తిని, ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ, సీపీఐ(ఎం) అన్నదమ్ముల్లాగా ఉంటామని, గతంలో కొన్ని ఇబ్బందులొచ్చినా భవిష్యత్తులో మంచైనా, చెడైనా కలిసే ముందుకు నడుస్తామన్నారు. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా శక్తివంతమైన పాత్ర పోషిస్తామన్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిస్తే 40 నుంచి 50 నియోజకవర్గాల్లో గెలిపించే లేదా ఓడించే శక్తి ఉందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రజాస్వామ్య పరిరక్షణకు, బీజేపీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పనిచేస్తున్న నేపథ్యంలోనే ఆ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించామని చెప్పారు. సీట్ల కోసం కక్కుర్తిపడేవారెవ్వరూ ఇక్కడ లేరని కూనంనేని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. సీపీఐ, సీపీఐ(ఎం)కు గౌరవ ప్రదంగా సీట్లిస్తేనే సర్దుబాటుకు అంగీకరిస్తామన్నారు.
ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చెరుపల్లి సీతారాములు,జాన్‌వెస్లీ, సీపీఐ జాతీయ సమితి సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్యపద్మ, ఈటి నర్సింహ్మా తదితరులు పాల్గొన్నారు.