Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సకల జనులకు ఆర్థిక, సామాజిక న్యాయం
- దేశం గర్వించదగ్గ స్థాయిలో విగ్రహాన్ని ఆవిష్కరిద్దాం
- ముఖ్య అతిథిగా అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్
- ఏర్పాట్లను పరిశీలించండి...: సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ కనబరిచిన దార్శనికతతోనే దళిత, గిరిజన, బహుజన వర్గాలతో పాటు సకల జనులందరికీ ఆర్థిక,సామాజిక న్యాయం, అన్ని రంగాల్లో సమాన న్యాయం అమల్లోకి వచ్చిందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందుకోసం తన జీవితాన్నే త్యాగం చేసిన ప్రపంచం గర్వించదగ్గ మేధావి అంబేద్కర్ అని కొనియాడారు. తన దూరదృష్టితో అనేక చర్చల అనంతరం, ప్రత్యేక రాష్ట్రాల కోసం, ఆర్టికల్ 3ని రాజ్యాంగంలో ప్రత్యేక శ్రద్ధతో ఆయన రూపొందించి పొందుపరిచారని సీఎం గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి మార్గం సుగమం చేసిన తెలంగాణ బాంధవుడు, అందరివాడు అంబేద్కర్ అని స్పష్టం చేశారు.
పక్కనే సచివాలయం, ఎదురుగా తన ఆరాధ్యుడు బుద్ధుని విగ్రహం, మరోదిక్కు త్యాగాలు చేసిన అమర వీరుల స్మారక స్థూపం..వీటి నడుమ హైదరాబాద్ నడిబొడ్డున శిఖరమంత ఎత్తున నిలిచిన అంబేద్కర్ మనలను నిత్యం చైతన్యపరుస్తూ పాలక వ్యవస్థకు నిత్య స్పూర్తివంతమై దారి చూపుతాడని సీఎం తెలిపారు. 125 అడుగుల ఎత్తులో నిర్మించిన ఆయన మహా విగ్రహాన్ని, శోభాయమానంగా తెలంగాణ సమాజంతో పాటు యావత్ దేశ ప్రజలు సంబురపడేలా గొప్పగా ఆవిష్కరించుకుందామని సీఎం కేసీఆర్ అన్నారు. దేశం గర్వించదగ్గ స్థాయిలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్న సందర్భంలో ఆవిష్కరణ సభ కూడా అంతే ఉన్నత స్థాయిలో,అంబేద్కర్ ఔన్నత్యాన్ని మరింత గొప్పగా ప్రపంచానికి చాటి చెప్పేలా ఉండాలంటూ సీఎం మంత్రులకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 14న అంబేద్కర్ పుట్టిన రోజు సందర్భంగా జరుపతలపెట్టిన విగ్రహావిష్కరణ కార్యక్రమం, అనంతరం నిర్వహించే బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు తదితర అంశాలపై ముఖ్యమంత్రి మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
అంబేద్కర్ విగ్రహం స్థాపించాలని నిర్ణయం తీసుకున్న నాటినుంచి, కలకాలం నిలిచే విధంగా సాంకేతికంగా, తయారీ పరంగా పకడ్బందీ చర్యలు తీసుకోవడానికి కనీసం రెండు సంవత్సరాల సమయం తీసుకున్నదని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇందుకు పలు దేశాలు, ప్రాంతాలు తిరిగి సమాచారాన్ని సేకరించి పూర్తి స్వదేశీ పరిజ్జానంతోనే రూపొందించడం తనకు అత్యంత సంతప్తిని కలిగించిందని సీఎం తెలిపారు.
''నేను ఊహించినదానికంటే అత్యద్భుతంగా విగ్రహం రూపం ఆవిష్కృతమైంది. ప్రసన్నవదనంతో నిలుచుని వున్న అంబేద్కరుడు ఒక తాత్విక జ్ఞానిగా అలరిస్తున్నాడు..'' అని కేసీఆర్ తన ఆనందాన్ని, సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విగ్రహ రూపశిల్పి.. 98 ఏండ్ల పద్మభూషణ్, రామ్ వంజీ సుతార్..కృషిని సీఎం ప్రశంసించారు. ఆయన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించాలని నిర్ణయించారు.
అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రజా ప్రతినిధులు, యావత్ ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలనే గొప్ప సంకల్పంతోనే.. రాష్ట్ర సచివాలయానికి ఆయన పేరును పెట్టుకున్నామని కేసీఆర్ తెలిపారు. ఇలాంటి చారిత్రాత్మక సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని తగు జాగ్రత్తలతో పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే అతిథులు, ప్రజల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రులకు, ఉన్నతాధికారులకు సూచించారు.
సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివే
- ఏప్రిల్ 14 న జరిగే.. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణను అత్యంత వైభవోపేతంగా, చారిత్రాత్మక వేడుకగా,కన్నుల పండుగగా దేశం గర్వించే రీతిలో జరపాలి.
- ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పూల జల్లు కురిపిస్తూ భారత రత్న, భారత రాజ్యాంగ నిర్మాత తెలంగాణ ప్రదాతకు ఘనమైన రీతిలో పుష్పాంజలి ఘటించాలి.
- గులాబీలు, తెల్ల చామంతి, తమలపాకులతో అల్లిన భారీ పూలమాలను రూపొందించాలి.
- 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికున్న భారీ పరదాను తొలగించడానికి,, నిలువెత్తు పూలమాలను అలంకరించడానికి....అతి పెద్ద క్రేన్‌ను ఉపయోగించాలి.
- ఈ కార్యక్రమానికి బౌద్ధ భిక్షువులను మాత్రమే ఆహ్వానించి వారి సాంప్రదాయ పద్దతిలోనే కార్యక్రమాన్ని నిర్వహించాలి.
- ఈ కార్యక్రమానికి.. సచివాలయ సిబ్బంది అధికారులతో పాటు..అన్ని శాఖల హెచ్వోడీలు, జిల్లా కలెక్టర్లు..రాష్ట్ర మంత్రులు, ఎంపీలు (రాజ్యసభ, లోక్ సభ) , ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మెన్లు హాజరు కావాలి.
- ప్రతి నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల నుంచి 35,700 మంది అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలి.
- ప్రజల తరలింపు కోసం 750 ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకోవాలి.
- హైదరాబాద్ చేరుకునే లోపే 50 కిలోమీటర్ల దూరంలోనే సభకు వచ్చిన ప్రజలకు భోజనం ఏర్పాట్లను చూసుకోవాలి. సభానంతరం తిరిగి వెళ్లేటప్పుడు కూడా రాత్రి భోజనం ఏర్పాట్లు చూసుకోవాలి.
- ప్రజల కోసం లక్ష స్వీట్ ప్యాకెట్లు, లక్షన్నర సల్ల ప్యాకెట్లు (విజయ డైరీవి), లక్షన్నర వాటర్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి.
- పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం వున్నందున, విగ్రహం చుట్టు పక్కల ప్రాంతాన్ని మొత్తం వినియోగించుకోవాలి. ప్రజలకు ఎండవేడి తగలకుండా షామియానాలు ఏర్పాటు చేయాలి.
- వాహనాల పార్కింగు బాధ్యతను హైద్రాబాద్ సీపీ తీసుకోవాలి. పార్కింగుకు అనువైన స్థలాన్ని పరిశీలించాలి.సభ రోజు సామాన్య ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను పోలీస్ యంత్రాంగం చూడాలి. సంబంధిత ఏర్పాట్లలో హెచ్ఎండీఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, డీజీపీ అంజన్ కుమార్, సీపీ సీవి ఆనంద్, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శులు అధికారులు బాధ్యత వహించాలి.
- ఈ సందర్భంగా ఘనమైన రీతిలో ఆట పాటలతో సంబురాలతో సాంస్కతిక కార్యక్రమాలను నిర్వహించాలి. ఇందుకు గిడ్డంగుల శాఖ చైర్మెన్, గాయకుడు సాయిచంద తో కలిసి సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ కార్యక్రమాలను రూపొందించాలి.
- అంబేద్కర్‌కు సంబంధించిన పాటలను మాత్రమే పాడుతూ, ఆ మహనీయునికి తెలంగాణ సాంస్కృతిక నీరాజనం అర్పించాలి. ఇందుకు సంబంధించిన రిహార్సల్స్ తదితర ముందస్తు సన్నద్దత బాధ్యతలను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీసుకోవాలి.
- అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే అధికారిక కార్యక్రమం..కాబట్టి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్ని ఏర్పాట్లను స్వయంగా పరిశీలించాలి.
- విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అంబేద్కర్ ముని మనుమడు ప్రకాశ్ అంబేద్కర్‌ను మాత్రమే ముఖ్య అతిథిగా ఆహ్వనించాలని నిర్ణయం.
- ఆ మహాశయుని ఔన్నత్యాన్ని చాటే విధంగా దేశవ్యాప్తంగా ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలు జారీ చేయాలి.
- ఇందుకు సంబంధించి మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డిలతో కూడిన కమిటీ తగు చర్యలు తీసుకోవాలి. దీంతో పాటు విగ్రహావిష్కరణ, సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.
ఈ సందర్భంగా సభికులకు అనువుగా ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయాలి. సభికుల కోసం 40 వేల కుర్చీలను ఏర్పాటు చేయాలి.
- ఎంపిక చేసిన ఆహ్వానితులు సంబంధిత మేధావులు తదితర ప్రముఖుల కోసం పాస్‌లు రూపొందించి జారీ చేయాలి.
- అంబేద్కర్ విగ్రహ రూపశిల్పి మహారాష్ట్రకు చెందిన రామ్ వంజీ సుతార్‌ను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా సత్కరించాలి.
సభా కార్యక్రమం
ఈ నెల 14న మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమై 5 గంటలకు ముగుస్తుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రారంభోపన్యాసంతో సభ ఆరంభమవుతుంది. అనంతరం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత ముఖ్య అతిథి ప్రకాశ్ అంబేద్కర్ ప్రసంగిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సందేశం ఉంటుంది. సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా ధన్యవాద ప్రసంగంతో సభ ముగుస్తుంది.