Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియామకాలు చేపట్టాలి
- నూతన పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలి
- అందరికీ పెన్షన్ ఇవ్వాలి
- తాత్కాలిక వర్కర్స్‌ను పర్మినెంట్ చేయాలి
- బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ మార్చ్
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
బ్యాంకుల ప్రయివేటీకరణ ఆపాలని, బ్యాంకుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బిఈఎఫ్ఐ) డిమాండ్ చేసింది. మంగళ వారం జంతర్ మంతర్‌లో బెఫీ ఆధ్వర్యంలో పార్లమెంట్ మార్చ్ జరిగింది. సీఐటీయూ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హేమలత, తపన్ సేన్, సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీ బికాష్ రంజన్ భట్టాచార్య, ఎఐకెఎస్ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్, ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం దావలే సంఘీభావం తెలిపారు. ''తగినన్ని నియామకాలు చేపట్టాలి. అందరికీ పెన్షన్ ఇవ్వాలి. నూతన పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేయాలి. క్యాజువల్, తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. వినియోగదారులకు ఉత్తమ సర్వీసు అందించాలి. ఆర్బిఐ స్వతంత్ర, అధికారాలను పరిరక్షిం చాలి. పెన్షన్ పెంచాలి. బ్యాంకుల ప్రయివేటీకరణ విరమిం చుకోవాలి. ఔట్సోర్సింగ్ ఆపాలి. సహకార బ్యాంకింగ్ రంగంపై దాడి ఆపాలి. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు (ఆర్ఆర్బి)ల్లో ఐపిఓను ఆపాలి'' అని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తపన్ సేన్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విధాన ప్రకటన చేసిందని, రెండు పిఎస్బిలను ప్రైవేటీకరించడం తక్షణ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. అంతేకాకుండా, ఐడిబిఐ బ్యాంక్‌ను విదేశీ పెట్టుబడి దారులకు విక్రయించాలని యోచిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడానికి పార్ల మెంటులో బిల్లు జాబితా చేయబడిందని, కార్మిక సంఘాలు, ప్రజాతంత్ర శక్తుల మద్దతుతో మొత్తం బ్యాంకు ఉద్యోగులు, అధికారుల ప్రతిఘటన కారణంగా ఈ చర్య నిలిప ివేయబడిందని పేర్కొన్నారు. ప్రయివేటీకరిస్తే ప్రజల డిపాజిట్‌కు భద్రత ఉండదనీ, ఇది ఉన్నత స్థాయి మోసాలకు దారి తీస్తుందని స్పష్టం చేశారు.
హేమలత మాట్లాడుతూ బహుళ-రాష్ట్ర పట్టణ సహకార బ్యాంకులు చిన్న ఆర్థిక బ్యాంకులుగా మార్చ బడ్డాయని, రాజ్యాంగం ప్రకారం సహకార సంస్థ రాష్ట్ర జాబితా అంశమైనప్పటికీ, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టానికి సవరణల చేసి కేంద్ర ప్రభుత్వం వాటిని నిర్వహించే అధికారాలను లాక్కుందని విమర్శించారు. ఇది రాజ్యాంగం కల్పించిన సమాఖ్య వ్యవస్థపై దాడి అని అన్నారు. ఈ కేంద్రీకరణ తరువాత దశలో వాటిని కార్పొరేట్లకు అప్పగి స్తారని విమర్శించారు. లక్షలాది మంది రైతులు, చేతి వృత్తులు, చిన్న వ్యాపారాలు, చిన్న సంస్థల జీవనోపాధికి ఇది పెద్ద దెబ్బ అని పేర్కొన్నారు.
బిఈఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి దేబాసిష్ బసు చౌదరి మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగం వృద్ధికి కారకులైన ఉద్యోగుల సంఖ్య దయనీయంగా తగ్గిపోతోందని, మరోవైపు పనిభారం పెరుగుతోందని అన్నారు. బ్యాంకింగ్ సేవలు డిపాజిట్ తీసుకోవడం, రుణాలు ఇవ్వడం వంటి ప్రాథమిక సేవలకు మించి విభిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. సిబ్బంది కొరత కారణంగా బ్యాంకు ఖాతాదారుల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందన్నారు. వినియోగదారుడు ప్రాథమిక సేవలకు దూరమయ్యారని పేర్కొన్నారు. సరిపడా సిబ్బంది లేకపోవడంతో బ్యాంకు ఉద్యోగులు, అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించడం లేదన్నారు. ఎన్‌పిఎస్‌ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్‌ను తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఈఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రదీప్ బిశ్వాస్, శ్రీనివాసు బాబు, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధాన కార్యదర్శి పి. అజరు కుమార్, ఉమా మహేశ్వరావు, విజరు సుందర్, తెలంగాణ నుంచి ప్రధాన కార్యదర్శి పి. వెంకటరాములు, టి. తిలక్, జి. మోహన్ కుమార్, వివిఎ ప్రసాద్ పాల్గొన్నారు.