Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యామంత్రి సబిత హెచ్చరిక
- ప్రశ్నాపత్రాలు లీక్ కాలేదు
- ఆందోళన చెందొద్దు
- విద్యార్థులు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి పరీక్షల నిర్వహణలో అవకతవకలు, అక్రమాలకు పాల్పడే ఉద్యోగులను శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తామని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ కాలేదని, ఈ విషయంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి విజ్ఞప్తి చేశారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో కట్టుదిట్టమైన చర్యలను చేపట్టిందని చెప్పారు. ఈ పరీక్షల విషయంలో స్వార్ధ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకోవద్దని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. ఇంకా మిగిలిన నాలుగు పరీక్షల నిర్వహణ విషయంలో మరింత కఠిన చర్యలు చేపట్టాలని ఆమె ఆదేశించారు. ఈ పరీక్షల నిర్వహణలో దాదాపు 55 వేల మంది అధికారులు, సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించొద్దని సూచించారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులు, సిబ్బందికి కూడా ఈ నిబంధన వర్తిస్తుందని మంత్రి స్పష్టంచేశారు. ఈ పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఏ విధమైన అపోహలకు, అనుమానాలకు తావులేదని వివరించారు. పరీక్షా పేపర్ల రవాణా విషయంలో మరింత భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆమె ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను పటిష్టంగా అమలు చేయడంతోపాటు జిరాక్స్ షాప్‌లను మూసేయించాలని కోరారు. ఇంటర్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించడంలో కృషిచేసిన అధికారులను ఆమె ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్య దర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచా లకులు శ్రీదేవసేన, పోలీస్ రేంజ్ ఐజీలు షానవాజ్ కాసీం, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిన్నారులను గందరగోళానికి గురిచేయొద్దు
పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో వైరల్ అవడాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనపై ఆమె ఆరా తీశారు. వరంగల్, హన్మకొండ డీఈవోలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకు న్నారు. పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన తొలి రెండు రోజులు వరుసగా తెలుగు, హిందీ ప్రశ్నాపత్రాలు బయటకు రావడంపై ఆమె స్పందించారు. పరీక్షల నిర్వహణ విషయంలో వ్యవహరించాల్సిన తీరుపై వివిధ శాఖల అధికారులకు ఆమె ట్విటర్ ద్వారా పలు సూచనలు చేశారు. పదో తరగతి పరీక్షల విషయంలో జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యాలు, పోలీసు విభాగం, పోస్టల్, వైద్యారోగ్య శాఖ, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. 4.95 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుతంగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. మొదటిసారి బోర్డు పరీక్షలు రాస్తున్న చిన్నారులను గందరగోళానికి గురిచేయొద్దని, అలా ఎవరు ప్రయత్నించినా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తు విషయంలో రాజకీయ, వ్యక్తిగత స్వార్థాన్ని వీడాలని కోరారు.
రాజకీయ లబ్దికోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు
పదో తరగతి పరీక్షల విషయంలో వాస్తవాలను తెలుసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుచేసేలా ప్రతిపక్షాలు దుందుడుకుగా వ్యవహరి స్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు.
కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందు కోసం విద్యార్థినీ విద్యార్థులను పావుగా ఉపయోగించు కోవడం ప్రతిపక్షాలకు తగదని మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న కుట్రలో బలికావొద్దని విద్యార్థులు, తల్లితండ్రులకు ఆమె విజ్ఞప్తి చేశారు. రాజకీయ లబ్ది కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని కోరారు. మొత్తం ఆరు పరీక్షల్లో మంగళవారం నాటికి రెండు పరీక్షా పత్రాలు లీకైనట్టు వస్తున్నవార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ది పొందాలనుకోవడం వారి దివాళా కోరు రాజకీయ విధానాలకు నిదర్శనమని విమర్శించారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేసి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడం రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని తెలిపారు. ఈ విషయంలో వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలను చేపట్టామని తెలిపారు.