Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే శాశ్వతంగా ఉద్యోగ తొలగింపు
- ఉట్నూర్ ఘటనపై ఆరా తీసిన ఉన్నతాధికారులు
- విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన
నవతెలంగాణ- ఉట్నూర్
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో పదో తరగతి జవాబు పత్రాల మాయంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ సంఘటన ఎలా జరిగింది..? ఆ జవాబు పత్రాల బండిల్ ఎక్కడ పడిపోయింది..? లోపం ఎక్కడుందో తెలుసుకునేందుకు అధికారులు విచారణ జరుపుతున్నారు. ఉట్నూర్‌లో సోమవారం జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. తప్పిపోయిన బండిల్లో ఎందరు విద్యార్థుల జవాబు పత్రాలు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి. మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్‌భాషా షేక్, జిల్లా విద్యాశాఖాధికారి టి.ప్రణీత, పోస్టల్‌శాఖ సూపరింటెండెంట్ ఉమామహేశ్వర్రావు, డీఎస్పీ నాగేందర్ సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. విద్యాశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు సైతం ఈ ఘటనపై ఆరా తీసినట్టు తెలిసింది.
ఎవరిది నిర్లక్ష్యం..?
ఈ నెల 3నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజున తెలుగు పరీక్ష ముగియగానే.. పరీక్ష కేంద్రంలోని అధికారులు, ఇన్విజిలేటర్లు జవాబుపత్రాలను బండిల్‌గా తయారు చేసి పోస్టాఫీసు ద్వారా అవి చేరుకోవాల్సిన ప్రాంతాలకు చేరవేస్తుంటారు. ఉట్నూర్‌లో సోమవారం విద్యాధికారులు 11బండిళ్లను చిరునామా రాసి పోస్టల్ శాఖకు అప్పగించారు. అక్కడి సిబ్బంది 11 కట్టలను విభజించి పోస్టాఫీసు నుంచి బస్టాండ్‌కు ఓ ఆటోలో తరలించారు. బస్సులో వేసే క్రమంలో 10 బండిల్స్ మాత్రమే ఉండటంతో పోస్టల్ సిబ్బంది మరో బండిల్ కోసం వెతికారు. ఈ విషయాన్ని రాత్రి వరకు గోప్యంగా ఉంచి వెతికినా ప్రయోజనం కనిపించలేదు. పోస్టల్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతోపాటు పోస్టల్ డిపార్ట్మెంట్కు చెందిన రజిత, నాగరాజును ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల జవాబుపత్రాలు మాయం కావడంపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఇందులో ఎవరివి ఉన్నాయో తెలియకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదే రోజున వికారాబాద్‌లో ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారగా.. ఉట్నూర్‌లో జవాబుపత్రాలు మాయం కావడం చర్చకు దారితీసింది. కీలకమైన ఈ పత్రాలను రక్షణ లేకుండా ఆటోలో తరలించడం.. మార్గమధ్యలో ఎక్కడ పడిపోయాయో కూడా తెలియని పరిస్థితి ఉండటం విమర్శలకు తావిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.