Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొఫెసర్ కోదండరాంతో షర్మిల భేటీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిరుద్యోగుల కోసం అన్ని పార్టీలు ఏకం కావాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల పిలుపునిచ్చారు. మంగళవారం ఆమె నాంపల్లిలోని తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాంతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగుల పక్షాన పోరాడటమే టీ-సేవ్ వేదిక లక్ష్యమనీ, ఆ వేదికలోకి అన్ని పార్టీలొస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. టీ-సేవ్ అధ్యక్షునిగా కోదండరాం ఉండాలని కోరినట్టు చెప్పారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. టీ-సేవ్లో భాగస్వామ్యం కావాలన్న షర్మిల ప్రతిపాదనపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
కూనంనేనితో షర్మిల భేటీ
నిరుద్యోగుల సమస్యపై కలిసి పోరాడదామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్కు ఆమె వెళ్లి కూనంనేనితో చర్చించి వినతిపత్రం సమర్పించారు. కూనంనేని మాట్లాడుతూ షర్మిల ప్రతిపాదనపై తమ పార్టీలో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, ఈటి నరసింహా, సీనియర్ నాయకులు ప్రేం పావని, తదితరులు పాల్గొన్నారు.