Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీల సూత్రదారులను కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమ, మంగళవారాల్లో తెలుగు, హిందీ ప్రశ్నాపత్రాల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. మంగళవారం హైదరాబాద్లోని నారాయణగూడ సర్కిల్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవ హారం విద్యార్థులు, తల్లిదండ్రులను ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు.
పరీక్ష ప్రారంభమైన నిమిషాల్లోనే ప్రశ్నాపత్రాలు లీక్ కావడాన్ని గమనిస్తే ఉద్దేశపూర్వకంగానే ఈ పరిణామాలు జరుగుతున్నట్టు అర్థమవుతున్నదని అన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఇన్విజిలేషన్ విధుల్లో ఉన్న ఉపాధ్యాయులే ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలకు ప్రశ్నాపత్రాల ను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని అరికట్టాలని, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు రెహమాన్, ఉప్పల ఉదరుకుమార్, అన్వర్, హరీశ్, శ్రీహరి, శివప్రసాద్, రాకేశ్, చినబాబు పాల్గొన్నారు.
పశ్నాపత్రాల లీకేజీలకు నిలయంగా తెలంగాణ : ఏఐవైఎఫ్
ప్రశ్నాపత్రాల లీకేజీలకు నిలయంగా తెలంగాణ మారిందని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలీ ఉల్లా ఖాద్రి, ప్రధాన కార్యదర్శి కె ధర్మేంద్ర విమర్శించా రు. విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమను కనబరుస్తున్నదని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవలి కాలంలో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం సర్వసాధారణంగా మారిందని పేర్కొన్నారు. విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టివేస్తున్నారని, విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీ కొరవడిందని విమర్శించారు. విద్యామంత్రి సమీక్షలు చేయ కుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని తెలిపారు. లీకేజీలకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.