Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థిని ఆత్మహత్య
నవతెలంగాణ-హయత్ నగర్
కులం పేరుతో తోటి విద్యార్థినులు వేధించడంతో తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరిగింది. ఎస్ఐ నర్సింహ, విద్యార్థిని తండ్రి ప్రభాకర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పెనుమాల విద్యా ప్రియాంక(18) హయత్‌నగర్‌లోని ధవావో ఇంటర్నేషనల్ మెడికల్ అకాడమీలో నీట్ పరీక్ష కోసం 6 నెలలుగా కోచింగ్ తీసుకుంటున్నది. ఆమె మరో నలుగురు విద్యార్థినులతో కలిసి హాస్టల్లో ఒకే గదిలో ఉండేది. ఈ క్రమంలో ప్రియాంక తక్కువ కులానికి చెందిందని, వారికి డాక్టర్ చదువు అవసరమా అని తోటి విద్యార్థినులు హేళన చేసేవారు. అలాగే, ఆ కులానికి చెందిన వారి వల్లే తమకు ఉద్యోగాలు రావడం లేదనేవారు. దాంతో ఆమె గట్టిగా వారిని నిలదీయడంతో తనతో మాట్లాడటం మానేశారు. ప్రియాంక సోమవారం రాత్రి తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పగా.. ధైర్యం చెప్పాడు . అనంతరం ప్రియాంక హాస్టల్ పై అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తెను చావుకు ప్రేరేపించే విధంగా చేసిన తోటి విద్యార్థినులపై చర్యలు తీసుకోవాలని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.