Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండోసారి జగిత్యాల జిల్లాలో పర్యటన
- చంచల్‌గూడ జైలు నుంచి కస్టడిలోకి ముగ్గురు
నవతెలంగాణ-సిటీబ్యూరో
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ మరింత దూకుడు పెంచింది. మంగళవారం ఐదు బృందాలుగా ఏర్పడిన సిట్ అధికారులు జగిత్యాల్ జిల్లాలో విచారణ నిర్వహించారు. సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం టీఎస్పీఎస్సీ కమిషన్ చైర్మెన్ జనార్దన్‌రెడ్డిని సోమవారం ప్రశ్నించిన విషయం తెలిసిందే. కమిషన్ విధి విధానాలు, పేపర్ లీకేజీ అంశాలపై మూడున్నర గంటలపాటు వివరాలు సేకరించారు. ఇప్పటికే ఈ కేసులో 15మందిపై కేసులు నమోదు చేసిన అధికారులు పలువురిని విచారించారు. మంగళవారం చంచల్‌గూడ జైలు నుంచి ప్రశాంత్, రాజేందర్, తిరుపతయ్యను కస్టడీకి తీసుకున్నారు. వారిని విచారించి పలు కీలక సమాచారం సేకరించినట్టు తెలిసింది. ఓ వైపు నిందితులను ప్రశ్నిస్తూనే.. మరోవైపు క్షేత్రస్థాయిలో విచారణ మొదలుపెట్టారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన పలువురిని విచారించినట్టు తెలిసింది. దాదాపు 40మంది ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినట్టు గుర్తించిన అధికారులు వారు ఎక్కడెక్కడ కోచింగ్ తీసుకున్నారో ఆరా తీసినట్టు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజశేఖర్ రెడ్డి స్వగ్రామమైన తాటిపల్లిలో సైతం సిట్ అధికారులు విచారణ నిర్వహించారు. రాజశేఖర్‌రెడ్డితో గ్రూప్-1లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఏమైనా స్నేహం, బంధుత్వం ఉందా అనే కోణంలో విచారించినట్టు తెలిసింది. అర్హత సాధించిన అభ్యర్థుల శక్తిసామర్థ్యాలు, వారి విద్యార్హత వివరాలు సైతం పరిశీలించినట్టు సమాచారం.