Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మైనర్‌తోపాటు మరో ఇద్దరు అరెస్ట్
- వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాధ్
- తాండూర్ కేసులో ఇద్దరికి రిమాండ్
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి / తాండూరు
పదో తరగతి పరీక్షల్లో హిందీ ప్రశ్నాపత్రం పరీక్ష ప్రారంభమైన గంటన్నరలో వాట్సప్‌లో వైరల్ అయింది. ఈ ఘటనలో ఒక మైనర్‌తోపాటు మరో ఇద్దరు నిందితులను వరంగల్ జిల్లా కమలాపూర్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాధ్ తెలిపారు. మంగళవారం రాత్రి వరంగల్ కమిషనరేట్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఉప్పల్ పరీక్ష కేంద్రంలో పదోతరగతి పరీక్ష రాస్తున్న తన స్నేహితునికి సహాయం చేసేందుకు నిందితుడైన మైనర్.. పాఠశాల వెనుక భాగంలోని ప్రహారి పక్కనే ఉన్న చెట్టును ఆనుకొని ఉన్న కిటికీ పక్కనే పరీక్ష రాస్తున్న బాలుడి నుంచి ఉదయం 9.45 గంటలకు హిందీ పరీక్షా పేపర్‌ను లాక్కున్నాడు.
దాన్ని తన సెల్ఫోన్లో ఫొటోలు తీసి మరో నిందితుడైన మౌటం శివగణేష్ వాట్సాప్ నెంబర్‌కు పోస్ట్ చేశాడు. శివగణేశ్ దాన్ని తన సెల్‌ఫోన్ ద్వారా ఎస్సెస్సీ 2019-20 అనే వాట్సాప్ గ్రూపుకు ఫార్వర్డ్ చేయగా, మరో నిందితుడు ప్రశాంత్.. ఆ ప్రశ్నాపత్రాన్ని వివిధ గ్రూపులకు ఫార్వర్డ్ చేశాడు. దాంతో వివిధ వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నాపత్రం చక్కర్లు కొట్టడంతో విద్యాశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు సైబర్ విభాగంతో పాటు స్థానిక పోలీసులు చేపట్టిన దర్యాప్తులో నిందితులను గుర్తించినట్టు సీపీ తెలిపారు. అరెస్టయిన వారిలో ఒక మైనర్ బాలుడితోపాటు కమలాపూర్ గ్రామానికి చెందిన మౌటం శివ గణేష్, హన్మకొండ మండలం ఆరేపల్లికి చెందిన బూర ప్రశాంత్ అనే మాజీ విలేకరి ఉన్నారన్నారు.
వారి నుంచి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నిందితులను గుర్తించడంలో ప్రతిభ కనపరిచిన కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ విభాగం ఇన్స్పెక్టర్ జనార్ధన్‌రెడ్డి, కమలాపూర్ ఇన్స్పెక్టర్ సంజీవ్, కమలాపూర్ ఎస్ఐలు చరణ్, సతీష్, హసన్‌పర్తి ఎస్ఐ విజరు, సతీష్, సైబర్ క్రైమ్ విభాగం ఏఏఓ ప్రశాంత్, కానిస్టేబుళ్లు కిషోర్, రాజు, ఆంజనేయులును కమిషనర్ అభినందించారు.
తాండూర్ కేసులో.. ఇద్దరు ఉపాధ్యాయులకు రిమాండ్
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో పదో తరగతి తెలుగు పేపర్ వాట్సాప్ ద్వారా బయటకు వచ్చిన ఘటనలో పోలీసులు ఇద్దరు ఉపాధ్యాయులను అరెస్టు చేయగా, మంగళవారం వారిని రిమాండ్‌కు తరలించారు. సోమవారం పదోతరగతి మొదటి పరీక్ష తెలుగు పేపర్ పరీక్ష ప్రారంభైన కొన్ని నిమిషాల్లో బయటకు వచ్చిన ఘటన తెలిసిందే. ఈ కేసులో.. మంగళవారం ఉదయం ఇద్దరిని అరెస్టు చేసి తాండూర్ జడ్జి ఎదుట హాజరు పరిచారు. వారికి 14రోజుల రిమాండ్ విధించగా.. పరిగి జైలుకు తరలించారు.