Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుద్యోగ వ్యతిరేక బీజేపీతో వేదిక పంచుకోం..
- షర్మిలకు తేల్చి చెప్పిన తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీపీఐ(ఎం) తెరచాటు రాజకీయాలు చేయబోదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. నిరుద్యోగులను కాపాడేందుకోసం ఏర్పాటు చేయదలిచిన టీ-సేవ్ ఫోరంలో భాగస్వామ్యం కావాలని కోరేందుకు మంగళవారం హైదరాబాద్‌లోని మాకినేని బసవపున్నయ్య భవన్లో తమ్మినేనితో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు.ఈ సందర్భంగా వారిద్దరి మధ్య పలు అంశాలు చర్చకొచ్చాయి. ఆ తర్వాత విలేకర్ల సమావేశంలో షర్మిల మాట్లాడుతూ ' ఈ రోజు ఉదయం తమ్మినేని మీడియాతో మాట్లాడుతూ మా పార్టీని బీజేపీకి బీ టీమ్ అంటూ విమర్శించారు. అయితే మేం ఎవరికీ బీ టీమ్ కాదు..కమ్యూనిస్టులే మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్కు బీ టీమ్‌గా వ్యవహరించారు' అని విమర్శించారు. ఈ నేపథ్యంలో షర్మిల మాట్లాడిన తీరుపై తమ్మినేని అభ్యంతరం వ్యక్తం చేశారు. సోదరి షర్మిలను మర్యాదతో కార్యాలయానికి ఆహ్వానించామని చెప్పారు. ఆమె మర్యాదను నిబెట్టుకోలేదని తెలిపారు.వారికి బీటీమ్..వీరికి బీటీమ్ అంటూ కమ్యూనిస్టులను విమర్శించే సాహసం చేయటం సరికాదన్నారు. మునుగోడు ఎన్నికల్లో తమ వైఖరి చాటుమాటుది కాదని స్పష్టం చేశారు. నిరుద్యోగ వ్యతిరేక బీజేపీతో కలిసి పనిచేయటానికి తమ విధానం అంగీకరించబోదన్నారు. అన్ని పార్టీలకు రాజకీయ వైఖరులు ఉంటాయని గుర్తుచేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అందరం మాట్లాడాల్సిందేనన్నారు. అయితే బీజేపీ ఉంటే తాము ఆ వేదికలో భాగస్వామ్యం కాలేమని తెలిపారు. ఫోరం పేరు, దానికి బాధ్యులను ముందే నిర్ణయించుకుని చెప్పడం మర్యాద కాదని హితవు పలికారు. వైఎస్ షర్మిల తమ దృష్టికి తీసుకొచ్చిన అంశాలను పార్టీలో చర్చిస్తామని తమ్మినేని ఈ సందర్భంగా వివరించారు. మీడియా సమావేశంలో సీపీఐ(ఎం) కార్యదర్శి వర్గ సభ్యులు చెరుపల్లి సీతారాములు, టి జ్యోతి, జాన్‌వెస్లీ తదితరులు పాల్గొన్నారు.