Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పేదలకు పరిహారం ఇచ్చాకే వారి ఇండ్ల కూల్చివేతపై నిర్ణయం తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పర్మాల క్రిష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. ట్యాంక్ బండ్ నుంచి మూసారాంబాగ్ వరకున్న మూసీనది ప్రధాన డ్రైనేజీకి ఇరువైపులా రిటైయినింగ్ వాల్ కట్టే క్రమంలో పేదల ఇండ్లు కూల్చకుండా అధికారులను ఆదేశించాలని ఇది వరకే సీఎం కేసీఆర్తో పాటు ఉన్నతాధికారులను కోరినట్టు తెలిపారు. దీంతో ఫీవర్ హాస్పిటల్ సమీపంలో శివానంద నగర్ దగ్గర పేదల పరిస్థితి దయనీయంగా తయారైందని తెలిపారు. డ్రైనేజీకి ఇరువైపులా 12 అడుగుల స్థలంలో గోడ నిర్మిస్తున్నారనీ, ఇందుకోసం వందలాది ఇండ్లు కూల్చేస్తుండటంతో పేదలు నిరాశ్రయులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే పేదల నివాస హక్కుల కోసం ఉద్యమిస్తామని హెచ్చరించారు.