Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సమగ్ర న్యాయ విచారణ జరపాలి
- ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీపై సమగ్రమైన న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 11న హలో విద్యార్థి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర కమిటీలు ప్రకటించాయి. ఈ మేరకు ఆయా సంఘాల రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, కోట రమేష్, టి నాగరాజు, ఆనగంటి వెంకటేశ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 11న విద్యార్థి, నిరుద్యోగుల మహాదీక్ష చేపడుతున్నామని తెలిపారు. ప్రశ్నాపత్రం లీకేజీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే స్పందించాలని, ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. లీకేజీ వల్ల నష్టపోయిన నిరుద్యోగులకు పరీక్షలు పూర్తయ్యేంత వరకు నెలకు రూ.20 వేలు నష్టపరిహారం చెల్లించాలని సూచించారు. ప్రశ్నాపత్రం లీకేజీ చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని తెలిపారు. నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. లీకేజీతో సంబంధం ఉన్న ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి : డీవైఎఫ్ఐ
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్; కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ లీకేజీలో బీజేపీ నేతలు, కార్యకర్తల హస్తం ఉందనే ఆరోపణలొస్తున్నాయని తెలిపారు. రాజకీయ స్వప్రయోజనాల కోసం ఆ పార్టీ నాయకులు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రశ్నాపత్రాల లీకేజీలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.