Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిలపక్ష పార్టీల నాయకులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జాతీయ రాజకీయాల మీద దృష్టిని కేంద్రీకరించి, సొంత రాష్ట్రంలో పరిపాలన మీద సీఏం కేసీఆర్ పట్టు కోల్పోయారని, అందుకే రాష్ట్రంలో పేపర్ల లీకేజీ అనేది ఒక ట్రెండ్‌గా మారిందని అఖిలపక్ష పార్టీల నాయకులు అభిప్రాయపడ్డారు. బుధవారం టీజేఏస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాల ఉమ్మడి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్రతరమవుతున్న నిరుద్యోగ సమస్య, టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ, పదవతరగతి పేపర్ల లీకేజీల మీద భవిష్యత్తు కార్యాచరణ గురించి సమగ్రంగా చర్చించారు. అఖిలపక్ష పార్టీలు, ప్రజా, విద్యార్థి, యువజన సంఘాలు ఒకే వేదికగా ఐక్యంగా పోరాడాలని నిర్ణయించారు. దీని కోసం ''టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యతిరేక పోరాట కమిటీ'' అనే వేదికను ఏర్పాటు చేశారు. ఈ వేదిక ద్వారా త్వరలోనే నిరుద్యోగులకు భరోసా కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్షాల ఆధ్వర్యంలో పోరాటాన్ని తీవ్రతరం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. దీనికి సంబంధించిన పూర్తి రోడ్ మ్యాప్ సిధ్ధం చేశారు. గురువారం సాయంత్రం 4 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగే విలేకరుల సమావేశంలో కమిటీ తరపున అఖిలపక్ష నాయకులు పూర్తి ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మల్లు రవి, టీజేఏస్ పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, బీయస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, తెలంగాణ బచావో ఫోరం కన్వీనర్ ఆకునూరి మురళి, సీపీఐఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యురాలు రమాదేవి, సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు జేవీ. చలపతి రావు, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కన్వీనర్ కన్నెగంటి రవి, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సుధాకర్, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.