Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి: ఎన్పీఆర్డీ రాష్ట్ర కార్యదర్శి అడివయ్య
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల జనాభాకనుగుణంగా సంక్షేమ పథకాల వాటా పెంచాలని, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని ఎన్పీఆర్డీ రాష్ట్ర కార్యదర్శి అడివయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల జనాభాలో 7రకాల వైకల్యాలు కల్గినవారు 10.48 లక్షల మంది ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం 2016 ఆర్పీడీ చట్టం ప్రకారం సుమారు 20 లక్షల మంది అలాంటి వారు ఉంటారని అంచనా వేస్తున్నామని చెప్పారు. వీటన్నింటికీ భిన్నంగా ఈ మధ్య కాలంలో తెలంగాణ డిసేబుల్డ్ స్టడీస్ ఇండియా రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో 43.02 లక్షల మంది(ఒకటి కంటే ఎక్కువ వైకల్యాలు కలిగిన వారు) వికలాంగులు ఉన్నారని పేర్కొన్నట్టు వివరించారు. మొత్తం జనాభాలో వికలాంగుల జనాభా 12.02శాతంగా ఉందని, ఈ రకంగా చూసినప్పుడు దేశ సగటు కంటే తెలంగాణలో ఎక్కువ మంది వికలాంగులు ఉన్నారని వివరించారు. ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి వికలాంగుల జనాభాకు అనుగుణంగా సంక్షేమ పథకాలలో వాటాను 12.02 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కొన్ని తరగతుల జనాభా కంటే వికలాంగుల జనాభానే ఎక్కువగా ఉందని తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగుల డిమాండ్ల చుట్టూ రాజకీయ పార్టీలు తిరిగే విధంగా బలమైన ఉద్యమాలు తెలంగాణ రాష్ట్రంలో రావాల్సిన అవసరం ఉందన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా వికలాంగుల హక్కులు, సంక్షేమ పథకాలు, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేష్ల అమలు కోసం పోరాడాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.