Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయనపై పీడీ యాక్టు నమోదు చేయాలి
- పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలి :మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నాపత్రాలు వాట్సాప్‌ల్లో ప్రత్యక్షమవటమనేది ముమ్మాటికీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాలతోనే జరిగిందని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. ఆయన సూచనలు, సలహాలతోనే ఏబీవీపీ, ఆరెస్సెస్, బీజేపీతోపాటు ఆ పార్టీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం తపస్ నేతలు, కార్యకర్తలు ఈ కుట్రకు పాల్పడ్డారని విమర్శించింది. అందువల్ల బండి సంజరుపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసి జైలుకు పంపాలని రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజరు కుమార్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్‌సభ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో వేర్వేరుగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పువ్వాడ, కొప్పుల, పల్లా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, అప్రదిష్ట పాల్జేసేందుకే బీజేపీ నేతలు లీకుల ప్రహసనాన్ని కొనసాగిస్తున్నారని విమర్శించారు. అందులో భాగంగానే బండి సంజరు తన అనుచరులకు ఆదేశాలనిచ్చి పదో తరగతి ప్రశ్నాపత్రాలను వాట్సాప్ ద్వారా బయటకు పంపారని తెలిపారు. గత 15,20 రోజులుగా ఇలాంటి రాజకీయ క్రీడలు కొనసాగుతున్నాయని చెప్పారు. బీజేపీ నేతల ఇలాంటి చర్యలను ప్రజలు చీదరించుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వ హయాంలో గతంలో ఎన్నో పరీక్షలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించామని వివరించారు. బీజేపీ ఢిల్లీ పెద్దల సూచనలు, సలహాలతోనే లీకుల బాగోతం నడుస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా ఆ పార్టీ తన తీరును మార్చుకోవాలని హితవు పలికారు. లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారంటూ హెచ్చరించారు. విలేకర్ల సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవనరెడ్డి, గొంగిడి సునీత, ముఠా గోపాల్, సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు పాల్గొన్నారు.