Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉండేందుకు ఇండ్ల జాగా కావాలి
- అద్దెలు కట్టలేక అప్పుల్లోకి..
- స్థలం కేటాయించాలని రామగుండంలో పేదల ఆందోళన
నవతెలంగాణ - సింగరేణి ప్రతినిధి(మదాసి రామ్ముర్తి)
రెక్కలు ముక్కలు చేసుకున్నా... కడుపునిండా బువ్వ దొరకని అభాగ్యులకు పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతం ఆసరాగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల పర్మినెంట్ ఉద్యోగాలు కనుమరుగయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు కాంట్రాక్టు కార్మికులుగా పని చేస్తున్నారు. కష్టానికి తగిన ఫలితం దక్కకపోయినా కష్టపడి పని చేసుకుంటున్నారు. వేలాదిమంది చేతివృత్తులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉండేందుకు వారికి సరైన నివాసం లేదు. రేకుల షెడ్లు, పాలథిన్ కవర్లు కప్పిన గుడారాలే నివాసాలయ్యాయి. పగలు సూర్యుడు, రాత్రి జాబిల్లి వెలుగులతో పోటీపడతారు. వానకు తడిసి, చలితో సహవాసం వీరి జీవితంలో భాగమైంది. ఇండ్ల స్థలాల కోసం ఏండ్ల తరబడి పోరాటం చేస్తున్నారు. అధికారుల చుట్టూ
తిరుగుతున్నారు. వారంతా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఎర్రజెండా పట్టుకుని పోరాటం చేస్తున్నారు.
నివేశనా స్థలాలు కావాలని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని నిరుపేదలు ఎర్రజెండా చేపట్టి సీపీఐ(ఎం) నేతృత్వాన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో భారీఎత్తున భూ పోరాటం చేస్తున్నారు. 18 రోజులుగా కొనసాగుతున్న భూ పోరాట కేంద్రాల్లో 'నవ తెలంగాణ' పర్యటించి అక్కడి వివరాలు సేకరించింది.
మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరొందిన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో భారీ పరిశ్రమలు ఉన్నాయి. ప్రభుత్వరంగ సంస్థల్లో పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య నామమాత్రమే. కాంట్రాక్టు కార్మికులు కీలకంగా పని చేస్తున్నారు. సింగరేణి, ఆర్ఎఫ్సీఎల్, ఎన్టీపీసీ, బసంత్‌నగర్ సిమెంటు కర్మాగారం, రామగుండం జెన్కో లో ఎక్కువమంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. అదేవిధంగా చేతివృత్తులను నమ్ముకుని ఎంతోమంది జీవనం సాగిస్తున్నారు. వారికి ఉండేందుకు సరైన ఇల్లు లేదు. ఇండ్లు కట్టిస్తామని ప్రభుత్వం చెప్పినా ఒక్కరికీ కేటాయించలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పనులు నత్తకే నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి. కనీసం నివేశనా స్థలాలైన కేటాయించాలని ప్రభుత్వ అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని పేదలు వాపోతున్నారు. పరిశ్రమల ఆధీనంలోనే వేలాది ఎకరాల భూములు ఉండటం వల్ల తామేమీ చేయలేకపోతున్నామని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు.
భూబకాసురుల ఆక్రమణలు.. తిరగబడుతున్న పేదలు
వాస్తవానికి ప్రభుత్వ భూములను కొందరు ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు, భూబకాసురులు ఒక జట్టుగా ఏర్పడి ఆక్రమించడం, దర్జాగా అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని సుమారు 7300మంది ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. ప్రభుత్వం 2268మందిని అర్హులుగా గుర్తించింది. అధికారుల పరిశీలన అనంతరం 768మందికి ఇండ్లను కేటాయించారు. ఇందులో కూడా పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మల్కాపూర్ జనగామ శివారులో 43ఎకరాల ప్రభుత్వ భూమిని, ఎన్టీపీసీ సమీపంలోని 15ఎకరాల భూమిని తమకు కేటాయించాలని స్థానిక పేదలు, కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేస్తున్నారు. భూ పోరాట కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే, 15 ఎకరాల స్థలాన్ని విక్రయించడానికి కొంతమంది ప్రజాప్రతినిధులు అధికారుల సహాయంతో ప్రయత్నం చేయగా.. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పేదలు అడ్డుకున్నారు. స్థలాల కోసం అక్కడ గుడిసెలు వేసుకొని పోరాడుతున్నారు. పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులు, ఆక్రమణదారుల నుంచి ప్రభుత్వ భూమిని స్వాధీనపరచుకొని అర్హులైన పేదలకు కేటాయించాలని సీపీఐ(ఎం) నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో జరుగుతున్న భూ పోరాట శిబిరాలను ఇటీవల సీపీఐ(ఎం) కేంద్ర, రాష్ట్ర నాయకులు సందర్శించి తమ సంఘీభావాన్ని ప్రకటించారు.
బెదిరింపులకు భయపడం
పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించే వరకు భూ పోరాటాన్ని కొనసాగిస్తాం. ప్రభుత్వ బెదిరింపులకు తలొగ్గేది లేదు. పెరిగిన ధరల నేపథ్యంలో కొనుగోలు శక్తి లేని ప్రజలు పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారు. కిరాయి ఇండ్లలో నివసించే కార్మికులు అద్దె చెల్లించలేక అప్పుల పాలవుతున్నారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలి, సొంత ఇంటి స్థలం కలిగిన వారికి రూ.5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం వీరికి మరో రూ.10లక్షలు తక్షణమే కేటాయించాలి.
వై.యాకయ్య- సీపీఐ(ఎం) పెద్దపల్లి జిల్లా కార్యదర్శి
ఎర్ర జెండాలతో ధీమా : మల్లీశ్వరి
ఇండ్ల స్థలాల కోసం సీపీఐ(ఎం) నాయకుల అండతో ఎర్రజెండాలు పట్టాం. స్థలాలు సాధించుకుంటామన్న ధీమా ఏర్పడింది. ఇక్కడే వండుకొని తింటున్నాం. నిలువ నీడలేని పేదోళ్లం.. మాకు డబుల్ బెడ్రూం ఇండ్లనైనా ఇవ్వండి, కనీసం ఇంటి జాగాలైనా ఇవ్వండి. ప్రాణం పోయినా సరే ఖాళీ చేతులతో ఈ స్థలాన్ని ఖాళీ చేసేదిలేదు.
మా గోస పట్టించుకోండి : జంగ భిక్షపతి
తినడానికి తిండి లేనోళ్లం. చేయడానికి పని దొరకడం లేదు. పది ఏండ్ల నుంచి ఇంటి జాగాల కోసం మున్సిపల్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు చుట్టూ తిరుగుతున్నాం. హామీలు ఇస్తున్నరు.. కానీ పట్టాలు ఇత్తలేరు. ప్రభుత్వ భూమిని నిరుపేదలకు కేటాయించాలని వందలాది మందిమి ఎర్రటెండలో పడిగాపులు పడుతున్నాం. మా గోస అర్థం చేసుకొని ఇంటి స్థలం ఇప్పించాలి.