Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇసుక అక్రమ రవాణాతో ప్రమాదాలపై..
- ప్రశ్నించినందుకు వీడీసీ దుశ్చర్య
- రాత్రికి రాత్రే కిరాయి ఇండ్లు ఖాళీ చేయించినట్టు వెల్లడి
నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ
రాత్రి వేళల్లో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తుండటంతో పొలాలకు వెళ్లే వారికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రశ్నించినందుకు నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం రామన్నపేట వీడీసీ సుమారు 300 ముదిరాజ్ కుటుంబాలను బహిష్కరించింది. 15 రోజులుగా తమకు చారు పొయడం లేదని, కిరణా సామాను ఇవ్వడం లేదని, మంచి చెడులకు వేరే కులస్తులను రానీయకుండా ఆంక్షలు విధించినట్టు వాపోయారు. బాధిత కుటుంబీకులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. రామన్నపేట గ్రామంలో సుమారు 6 వేల జనాభా ఉండగా, వారిలో సుమారు 300 ముదిరాజ్ కుటుంబాలు ఉన్నాయన్నారు. గ్రామంలోని కప్పల వాగు నుంచి సంగేమ్ కిషన్ ఇసుకను అక్రమంగా జేసీబీతో తవ్వించి టిప్పర్లు, ట్రాక్టర్లతో లోడింగ్ చేసుకొని అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. రాత్రుళ్ళు పెద్ద పెద్ద వెహికల్స్ ఇసుకతో నడవటం వల్ల నిద్ర పట్టడం లేదని, పొలాలు, తోటల్లో కరెంట్ మోటార్ల దగ్గరికి వెళ్లి తిరిగి వస్తుండగా ఇసుక తరలిస్తున్న వాహనాలు తమపైకి వస్తున్నాయని తెలిపారు. ఇలాగయితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాహనాలు ఆపి అడిగినందుకు తమపై వీడీసీ కక్ష కట్టినట్టు ఆరోపించారు. తమ కుటుంబాలను 15 రోజుల కిందట బహిష్కరించారని, అప్పటి నుంచి గ్రామంలోని హౌటల్లలో తమకు చారులు పోయడం లేదని, కిరాణా షాపుల్లో నిత్యావసర సామాను ఇవ్వటం లేదని, మటన్, చికెన్ షాపుల్లోనూ ఇదే పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి చెడులకు ఇతర కులస్తులెవ్వరినీ రానీయ్యకుండా వీడీసీ ఆంక్షలు విధించిందని వాపోయారు. కిరాయికి ఇతరుల ఇండ్లలో ఉన్న వారిని రాత్రికి రాత్రే ఖాళీ చేయించారని, తమ ఇండ్లల్లో ఉన్న కిరాయిదుకాణాలను సైతం తీసివేయించారని వాపోయారు.
వీరి విష బీజాలు పిల్లలపై సైతం రుద్దుతున్నారని, దాంతో స్కూళ్లల్లో తమ పిల్లలతో వేరే పిల్లలు మాట్లాడటం లేదని తెలిపారు. గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి, లింబాద్రి, నాగుల శేఖర్ తమపై బహిష్కరణకు ప్రధాన కారణమని, వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో గడ్డం సంఘం ముదిరాజ్, బొమ్మ సంఘం ముదిరాజ్, ఈర్ల సంఘం ముదిరాజ్, కుంట కింది సంఘం ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు.