Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొడుకు పుట్టాక భార్యను వద్దంటున్న బీజేపీ నాయకుడు
- తనకు న్యాయం చేయాలని వేడుకోలు
నవతెలంగాణ మద్దూరు
కొడుకు పుట్టాక బీజేపీ నాయకుడు భార్యను కాపురానికి తీసుకెళ్లకపోవడంతో ఆమె తన భర్త ఇంటి ఎదుట బైటాయించి ఆందోళనకు దిగింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లిలో బుధవారం జరిగింది. నర్సాయపల్లి గ్రామానికి చెందిన మాజీ ఆర్మీ సైనికుడు బద్దిపడగ శ్రీనివాస్‌రెడ్డి బీజేపీ సైనిక దళ జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. కాపురానికి తీసుకుపోకుండా వేధింపులకు గురి చేయడంతో భార్య తన కుమారునితో కలిసి భర్త
ఇంటిముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా బాధితురాలు బద్దిపడగ అంజలి మాట్లాడుతూ.. నర్సాయపల్లి గ్రామానికి చెందిన బద్దిపడగ శ్రీనివాస్‌రెడ్డితో తనకు 2019లో వివాహం జరిగిందన్నారు. పెండ్లి చేసుకున్న కొద్ది రోజులకు ఉద్యోగరీత్యా లక్నోకి వెళ్లాడని తెలిపారు. అప్పటినుంచి అతని తల్లిదండ్రులు, అతని అన్న, వదినలు వేధించడం ప్రారంభించారని తెలిపారు. తీవ్ర వేధింపులకు గురి చేసి తన పుట్టిల్లియిన సిద్దిపేట జిల్లా రామాయంపేటకు పంపించారని వాపోయారు. తన భర్త శ్రీనివాస్ రెడ్డి ఉద్యోగం ముగించుకుని స్వగ్రామం వచ్చిన తర్వాత మా అమ్మవాళ్ల ఇంటికి వచ్చి తనను తీసుకెళ్లాడని, అనంతరం వారం రోజుల నుంచి అందరూ కలిసి తీవ్రంగా వేధించారని తెలిపారు. వారి వేధింపులను తట్టుకోలేక సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో 2020 ఫిబ్రవరిలో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ విషయంపై సఖి కేంద్రానికి పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారని గుర్తు చేశారు. అయినా అతనిలో ఎలాంటి మార్పు రావడంలేదన్నారు. పైగా.. అదనంగా కట్నం తీసుకువస్తే తప్ప కాపురానికి తీసుకుపోనని, లేదంటే విడాకులు ఇస్తానని బెదిరిస్తూ... అతని కుటుంబ సభ్యులతో కలిసి తనపై దాడి చేశారన్నారు న్యాయం జరిగే వరకూ తన భర్త ఇంటి ఎదుట కుమారునితో ఎన్ని రోజులైనా బైటాయిస్తానని స్పష్టం చేశారు. వేధింపులకు గురిచేస్తున్న భర్త, అతని కుటుంబంపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల నాయకులు ఆమెకు మద్దతు తెలిపారు.