Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారంలో కొనసాగే హక్కు బీజేపీకి లేదు
- 14 నుంచి దేశవ్యాప్త ప్రచారోద్యమం
- సీపీఐ జాతీయ కార్యదర్శి బినరువిశ్వం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మోడీ హఠావో... దేశ్‌కో బచావో అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి, ఎంపీ బినరు విశ్వం పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని, లౌకికత్వాన్ని ధ్వంసం చేస్తున్న బీజేపీకి అధికారంలో కొనసాగే హక్కు లేదన్నారు. లౌకిక, ప్రజాస్వామిక, వామపక్ష పార్టీలన్నీ ఏకమై వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ పాలనలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం ప్రమాదంలో పడ్డాయన్నారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రమాదకరమైన విధానాలపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఈనెల 14 నుంచి వచ్చేనెల 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ప్రచారోద్యమం చేపడుతున్నామని వివరించారు. దేశంలో అవినీతిని అరికట్టడంలో సీబీఐ బాగా పనిచేస్తుందంటూ ఇటీవల ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. సీబీఐతోపాటు ఇతర దర్యాప్తు సంస్థలకు స్వేచ్ఛనిస్తే బీజేపీ నాయకులపైనే అవినీతి కేసులు ఎక్కువగా నమోదవుతాయని ఎద్దేవా చేశారు. ఆ కేసుల్లో ప్రధాని మోడీ పేరు కూడా ఉంటుందని చెప్పారు. సీబీఐ చేతులు కట్టి బాగా పనిచేస్తుందంటూ ప్రధాని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ప్రసంగాలు చేయడంలో మోడీ మొనగాడని, ఆచరణ మాత్రం శూన్యమని విమర్శించారు. అదానీ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోని ప్రధాని అవినీతిపై ఎన్ని మాటలు మాట్లాడినా వృధాయేనని చెప్పారు. గుజరాత్‌కు చెందిన చిన్న వ్యాపారి అదానీ మోడీ ప్రధాని అయ్యాక ప్రపంచంలోనే కుబేరుల జాబితాలో రెండో స్థానానికి చేరారని వివరించారు. అందుకే మోడీని మోదానీ అంటున్నారని చెప్పారు. అదానీ అక్రమాలపై జేపీసీతో విచారణ చేయాలని మోడీకి సవాల్ విసిరారు.
పడిపోతున్న రూపాయి విలువ : అజీజ్‌పాషా
డాలర్‌తో పోల్చినప్పుడు భారత రూపాయి విలువ పడిపోతున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌పాషా అన్నారు. ఆసియా ఖండంలోనే భారతదేశం చివరన ఉందన్నారు. డాలర్‌తో పోల్చితే రూపాయి 8.6 శాతం పడిపోయిదని వివరించారు. సింగపూర్, మలేసియా కరెన్సీ విలువ 6.4 శాతం, థారులాండ్ కరెన్సీ 2.4 శాతమే పడిపోయిందని గుర్తు చేశారు. ఎంతో అభివృద్ధి సాధించామంటూ గొప్పలు చెప్పే మోడీ ప్రభుత్వం రూపాయి పతనంపై ఏం సమాధానం చెబుతుందంటూ ప్రశ్నించారు. రూపాయి విలువను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలోని బ్యాంకులు, ఎల్ఐసీ, గనులు, ఖనిజాలు, వనరులను పెట్టుబడిదారులకు కట్టబెడుతూ, ప్రధాని మోడీ దేశ సంపదను లూటీ చేయిస్తున్నారని విమర్శించారు. ఈ అంశాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. స్వదేశీ జపం చేసే ఆర్ఎస్ఎస్, బీజేపీ వాస్తవంగా విదేశీ పెట్టుబడులకే ఎర్ర తివాచీ వేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్యపద్మ, ఈటి నరసింహా తదితరులు పాల్గొన్నారు.