Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరోవైపు వర్ష సూచన
- నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో 43 డిగ్రీల ఎండ
- 17 జిల్లాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
- ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ
- పలు జిల్లాలకు వర్ష సూచన, వడగండ్లు పడే అవకాశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఏప్రిల్ మొదటి వారంలోనే ఓవైపు భానుడు భగభగ మండిపోతున్నాడు. మరోవైపు గాలి, వడగండ్ల వానలు అన్నదాతలను కలవరపెడుతున్నాయి. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో అత్యధికంగా 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. ఈ ఏడాది ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. రాష్ట్రంలో 17 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎనిమిది జిల్లాల్లో (వనపర్తి, నిజామాబాద్, ఆదిలాబాద్, నాగర్కర్నూల్, వికారాబాద్, సంగారెడ్డి, నల్లగొండ, నిర్మల్) 41 డిగ్రీలకుపైన రికార్డయ్యాయి. ఆ జిల్లాలకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికా సంస్థ(టీఎస్డీపీఎస్) ఆరెంజ్ హెచ్చరికను జారీచేసింది. రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల(30 నుంచి 40 కిలోమీటర్ల వేగం)తో కూడిన వడగండ్ల వాన కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది. వర్షానికి సంబంధించి ఆరెంజ్ హెచ్చరిక జాబితాలో కొమ్రంభీమ్ అసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలున్నాయి. రాబోయే 48 గంటల్లో హైదరాబాద్ పరిధిలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే సూచనలున్నాయి. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆలపల్లిలో అత్యధికంగా 3.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తిలో 2.1 సెంటీమీటర్ల వాన పడింది.