Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈడీ, సీబీఐని నియంత్రిస్తున్నారు
- అదానీని ముట్టుకునే దమ్ము ఈడీ, సీబీఐకి ఉందా?
- బీజేపీని గద్దె దింపడమే మా లక్ష్యం :సీపీఐ ఎంపీ బినోరు విశ్వం
నవతెలంగాణ-హనుమకొండ
దేశంలో ఈడీ, సీబీఐలకు స్వేచ్ఛనిస్తే ప్రధాని మోడీ సహా బీజేపీ నాయకులంతా జైల్లోనే ఉంటారని సీపీఐ పార్లమెంటరీపక్ష నాయకులు బినోరు విశ్వం అన్నారు. సీపీఐ 'ప్రజాపోరు యాత్ర' ముగింపు సందర్భంగా హనుమకొండలో బుధవారం బహిరంగ సభ నిర్వహించారు. సభలో బినోరు విశ్వం మాట్లాడుతూ.. దేశంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన అదానీ సహా కార్పొరేట్ శక్తులందరికీ మోడీ అండ ఉందన్నారు. మోడీ ప్రధాని అయ్యాకే అదానీ, అంబానీ ఆస్తులు అమాంతం పెరిగాయని, అవినీతిపరులంతా బీజేపీ పాలనలోనే పెరిగిపోయారని చెప్పారు. మోడీ, అదానీ వేర్వేరు కాదు ఒక్కటేనంటూ ఈడీ, సీబీఐకి అదానీని ముట్టుకునే దమ్ము, దైర్యం ఉందా ? అని ప్రశ్నించారు. అదానీ అంశం తెరపైకి రాకుండా పార్లమెంటులో జేపీసీ వేయకుండా బీజేపీ అడ్డుకున్నదని విమర్శించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదనీ, పేదలకు కూడు, నీడ కల్పించలేదని అన్నారు. అందుకే ప్రజల పక్షాన, పేదల పక్షాన సీపీఐ పోరాడుతున్నదన్నారు. దేశంలో బీజేపీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా వామపక్ష లౌకిక ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాలని, ఏకమైతే బీజేపీని సాగనంపడం ఖాయమన్నారు. మోడీ హటావో, దేశ్‌కి బచావో పేరుతో సీపీఐ జాతీయ స్థాయిలో పోరాడుతున్నదని చెప్పారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న భూ పోరాటాలు చారిత్రాత్మకమని, ఈ పోరాటంలో పేదలు విజయం సాధించడం తథ్యమని అన్నారు.
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. బయ్యారం ఉక్కు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వ విద్యాలయం వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందేదని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్లకు కొమ్ముగాస్తూ పేదలను విస్మరించిందన్నారు. అందుకే బీజేపీ హటావో.. దేశ్‌కి బచావో నినాదం ఎత్తుకున్నామని చెప్పారు.
రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. సీపీఐ ఎల్లప్పుడూ ప్రజల పక్షమేనని, పాలకుల పక్షం కాదన్నారు. పేదలకు ఇండ్లు, స్థలాలు ఇవ్వకుంటే పోరాటం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పేపర్ లీకేజీలతో బీజేపీ నేతలు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మత రాజకీయాలు కరోనా కంటే ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీని తరిమికొట్టడం కోసం గొంగళి పురుగునైనా ముద్దు పెట్టుకుంటామని, ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడే వారితో కలిసి పనిచేస్తామని చెప్పారు. మానవజాతి ఉన్నంత వరకూ కమ్యూనిస్టులు ఉంటారన్నారు.
కుడా మైదానంలో జరిగిన బహిరంగ సభకు సీపీఐ వరంగల్, హనుమకొండ జిల్లా కార్యదర్శులు మేకల రవి, కర్రె బిక్షపతి అధ్యక్షత వహించగా జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా, జాతీయ సమితి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, పాదయాత్ర కన్వీనర్ తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శులు బి.విజయ సారథి, సీహెచ్.రాజారెడ్డి, కొరిమి రాజ్‌కుమార్, తోట మల్లికార్జునరావు, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, షేక్ బాష్మియా, నాయకులు బి.అజరు, ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, వలీఉల్లా ఖాద్రి, మారుపాక అనిల్‌కుమార్, నల్లు సుధాకర్‌రెడ్డి, జంపాల రవిందర్ తదితరులు పాల్గొన్నారు.