Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పది ప్రశ్నాపత్రం లీకులో ఏ1గా బండి సంజయ్
- వరంగల్ కోర్టులో హాజరు.. 14 రోజుల రిమాండ్
- కరీంనగర్ జైలుకు తరలింపు
- మరో 10 మందిపై కేసు నమోదు
- ఇదంతా గేమ్ ప్లాన్.. : సీపీ ఏవీ రంగనాధ్
- అరెస్ట్‌పై లోక్‌సభ స్పీకర్‌కు సమాచారం
- బీఆర్ఎస్, బీజేపీల పరస్పర ఆందోళనలు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి/ బొమ్మలరామారం
పదో తరగతి హిందీ పరీక్షా పత్రం లీకు విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ను ఏ1గా పోలీసులు పేర్కొన్నారు. బండి సంజయ్‌ను మంగళవారం అర్థరాత్రి కరీంనగర్లో అరెస్ట్ చేసి బుధవారం సాయంత్రం హన్మకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. ఇరువైపులా వాదనలు విన్న అనంతరం జడ్జి అనిత రాపోలు.. బండి సంజరుకు 14 రోజులు (ఈ నెల 19వ తేదీ వరకు) రిమాండ్ విధిస్తున్నట్టు తీర్పు వెల్లడించారు. పదో తరగతి పేపర్ల లీక్ పక్కా ప్రణాళికలో భాగంగానే జరిగినట్టు బుధవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాధ్ వివరించారు. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలోనే.. పేపర్ల ఫొటోలు వాట్సాప్‌లో బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ను కరీంనగర్లో మంగళవారం అర్ధరాత్రి అరెస్టు చేసిన పోలీసులు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి వరంగల్‌కు తరలించారు. ఈ కేసులో 10 మందిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు ఒక మైనర్‌తోపాటు ఐదుగురిని అరెస్ట్ చేయగా, మరో ఐదుగురు పరారీలో ఉన్నారని తెలిపారు. వీరిపై 120 (బి), 420, 447, 505 (1)(బి), ఐపిసి సెక్షన్ 4(ఎ), 6 రెడ్ విత్ 8 తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ మాల్‌ప్రాక్టీసెస్) యాక్ట్ 1997, సెక్షన్ 66-డి ఐటీ యాక్ట్ 2008 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అరెస్టయిన వారిలో.. ఏ2.. బూర ప్రశాంత్, ఏ3.. గుండెబోయిన మహేశ్, ఏ4.. మైనర్ బాలుడు, ఏ5.. మోతం శివగణేష్, ఏ6.. పోగు సురేష్, ఏ7.. పోగు శశాంక్, ఏ8.. దూలం శ్రీకాంత్, ఏ9.. పెరుమాండ్ల శార్మిక్, ఏ10.. పోతబోయిన వసంత్ ఉన్నారని తెలిపారు. వరంగల్ కమిషనరేట్‌లో బుధవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో సీపీ రంగనాథ్ కేసు వివరాలు వెల్లడించారు. ఏ2గా ఉన్న బూర ప్రశాంత్ గతంలో హెచ్ఎం టివీలో పనిచేశారని, ఇప్పుడు బీజేపీకిి చెందిన నమో టీవీలో ప్రతినిధిగా, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో కీలకంగా పనిచేస్తున్నారని తెలిపారు. సోమవారం సాయంత్రం బండి సంజయ్‌తో ప్రశాంత్ వాట్సాప్ కాల్లో మాట్లాడారన్నారు. మంగళవారం ఉదయం 11.24 గంటలకు ప్రశాంత్, సంజయ్‌కి హిందీ పేపర్‌ను వాట్సాప్‌లో పంపారని, ఆయనిచ్చిన సమాచారంతోనే ఉదయం 11.30 గంటల నుంచి 11.50 గంటల మధ్య బండి సంజయ్ మీడియాతో మాట్లాడారన్నారు. పక్కా ప్లాన్‌తోనే ఈ వ్యవహారం నడిపించారన్నారు. బండి సంజయ్‌ని కరీంనగర్లో ప్రివెంటివ్ కింద అరెస్టు చేసి కేసు ఇక్కడ ఉండటం వల్ల వరంగల్‌కు తీసుకొచ్చినట్టు తెలిపారు. వారెంట్, నోటీసు లేకుండా అరెస్ట్ చేయొచ్చని సెక్షన్ 41 సీఆర్పీసీ చెబుతుందన్నారు. పార్లమెంట్ స్పీకర్‌కు కూడా బండి సంజయ్ అరెస్ట్‌పై సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. న్యాయపరంగానే ముందుకు వెళ్తున్నామని, మాపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవన్నారు. చాలా మంది కాల్‌డేటా డిలిట్ చేశారని, బండి సంజయ్ తన ఫోన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. సంజరు ఫోన్ డేటా లభిస్తే మరింత సమాచారం తెలస్తుందన్నారు. విద్యార్థుల్లో అయోమయం సృష్టించాలనే కుట్రతోనే చేసినట్టు ప్రాథమికంగా గుర్తించామన్నారు. ప్లాన్ చేశారు కాబట్టే బండి సంజయ్‌ని ఏ1గా పెట్టడం జరిగిందన్నారు. ఈటల రాజేందర్‌కు కూడా మెసేజ్ పంపారని చెప్పారు. కమలాపూర్ నుంచి పేపర్ రావడం వెనుక ఉన్న పక్కా ప్లాన్‌పై విచారణ జరుపుతున్నామన్నారు. విలేకరుల సమావేశంలో సెంట్రల్ డీసీపీ అబ్దుల్ బారీ, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ జితేందర్‌రెడ్డి, కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సంజయ్ అరెస్టుతో ఉద్రిక్తత పరిస్థితులు
పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ కేసులో.. బండి సంజయ్‌ను కరీంనగర్లో అరెస్ట్ చేసి వరంగల్ కోర్టుకు తీసుకువస్తున్న క్రమంలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపీ శ్రేణులు పోలీస్స్టేషన్లు, మార్గమధ్యలో ధర్నాలు, అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పరస్పర ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కరీంనగర్లో అరెస్ట్ చేసి యాదాద్రి జిల్లా బొమ్మలరామారంకు తరలించడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు బుధవారం బొమ్మలరామారం పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని లోపలికెళ్లేందుకు ప్రయత్నించారు. అయన్ను పోలీసులు అడ్డుకున్నారు. యాదాద్రి భువనగిరి నుంచి మధ్యాహ్నం జనగామకు తరలిస్తుండగా, పెంబర్తి వద్ద బీజేపీ శ్రేణులు అడ్డుకునే యత్నం చేశాయి. దాంతో పోలీసులు లాఠీఛార్జి చేసి సంజరుని పాలకుర్తికి తరలించారు. అక్కడ ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ చెకప్ చేయించి వర్ధన్నపేటకు తరలించారు. వర్ధన్నపేటకు సంజయ్‌ని తరలిస్తున్నట్టు సమాచారం రాగానే ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సంజరుని జఫర్‌గఢ్‌కు తరలించి అక్కడి నుంచి మడికొండ పీటీసీకి తరలించారు. ఈ క్రమంలో వరంగల్ కోర్టుకు బండి సంజయ్‌ని తరలిస్తున్నట్టు ప్రచారం జరగడంతో బీజేపీ కార్యకర్తలు చేరుకున్నారు. వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. దీనికి ప్రతిగా అదాలత్ అమరవీరుల స్తూపం వద్ద ఛీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, వాసుదేవరెడ్డి నాయకత్వంలో బండి సంజరు దిష్టిబొమ్మను దహనం చేశారు. వరంగల్ అదాలత్‌కు సాయంత్రం బండి సంజయ్‌ని తరలిస్తుండగా, బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పులు, కోడిగుడ్లు విసిరి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోర్టు వద్ద భారీ బందోబస్తును నిర్వహించి సంజయ్‌ని న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.